బిజెపి యువ మహిళా నేత అరెస్ట్

183

 

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ యువ మ‌హిళా నేతను కోల్‌క‌తా పోలీసులు శ‌నివారం (20-2-2021) అరెస్టు చేశారు.

ఈమె త‌న కారులో వంద గ్రాముల కొకైన్ త‌ర‌లిస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

ఈమెతో పాటు మ‌రో నేత ప్ర‌బిర్ కుమార్ డే ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంత‌రం ఆ మ‌హిళ‌ను ప‌మేలా గోస్వామిగా పోలీసులు గుర్తించారు.

ఈమె బెంగాల్ బీజేపీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు.

ఈమె ప‌ర్సులో కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే కొకైన్‌, ఆమె కారు సీటు కింద మ‌రికొన్ని కొకైన్ పొట్లాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘ‌ట‌న న్యూ అలీపోర్ ప్రాంతంలో తెల్ల‌వారుజామున జ‌రిగింది.

గోస్వామి, ఆమె స‌హ‌చరుడు ప్ర‌బీర్ కుమార్ డే క‌లిసి ఎన్ఆర్ అవెన్యూలోని ఒక కేఫ్‌కు వెళుతుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు.

ఆ కారులో ప‌మేలా గోస్వామి సెక్యూరిటీ గార్డు కూడా ఉండ‌టంతో అత‌నిని కూడా అరెస్టు చేశారు.

బీజేపీకి చెందిన సామిక్ భ‌ట్టాచార్య మాట్లాడుతూ…

పోలీసులు రాష్ట్ర నియంత్ర‌ణ‌లో ఉన్నార‌ని, ఇదంతా కావాల‌నే ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నింద‌ని ఆయ‌న ఆరోపించారు. కొకైన్‌ను కారులో ఎవ‌రు పెట్టారో తెలియాల్సి ఉంద‌న్నారు.

అయితే బీజేపీ నాయ‌కుల నిజ చ‌రిత్ర ఇదే అని తృణ‌మూల్ కాంగ్రెస్ నాయకులు మండిప‌డుతున్నారు. బెంగాల్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంపై తాను సిగ్గుప‌డుతున్నాన‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ నేత చంద్రిమా భ‌ట్టాచార్య అన్న‌రు.

కొంత మంది నాయ‌కులు పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కేసులో దొరికార‌ని, ఇప్పుడు మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా రేసులో ప‌ట్టుబ‌డుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఒక కేఫ్‌ను ప‌మేలా గోస్వామి, ప్ర‌బీర్ ప‌దే ప‌దే సంద‌ర్శించ‌డం, ఆపి ఉంచిన కారులో కూర్చోవ‌డం, మోటారు సైకిళ్ల‌పై వెళ్లే యువ‌కుల‌తో లావాదేవీలు జ‌ర‌ప‌డం వంటి చ‌ర్య‌ల‌తో అనుమానం వ‌చ్చి ప‌రిశీలించామ‌ని ఆమె వ‌ద్ద కొకైన్ ల‌భించింద‌ని పోలీసులు చెబుతున్నారు.

ప‌మేలా గోస్వామి బీజేపీలో చేర‌క‌ముందు ఎయిర్‌హోస్టెస్‌గా, మోడ‌ల్‌, టీవీ సీరియ‌ల్ న‌టీమ‌ణిగా ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌మేలా గోస్వామి అరెస్టు వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ రేపుతోంది.

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ ఘ‌ట‌న బీజేపీ పెద్ద‌లకు త‌ల‌నొప్పిగా మారింది.