
తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు వైయస్ షర్మిల ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైయస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలో జై తెలంగాణ, జై వైయస్సార్ అని ఆమె నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటిపై మాట్లాడదామని అన్నారు.
రైతులు, విద్యార్థులు, పేదలకు ఉపయోగపడేలా దివంగత వైయస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని అన్నారు.