వేడివేడిగా పొగలు కక్కుతూ ఉండగానే అమ్మకం.. పరిశుభ్రమైన పళ్లెంలో.. మిలమిల మెరిసే మెరుపు కాగితంపై.. సన్న బియ్యంతో తయారు చేసిన వెజ్ బిర్యానీ.. ప్లాస్టిక్ స్పూన్.. ఉచితంగా పరిశుభ్రమైన తాగునీరు.. 15 ఏళ్లుగా తక్కువ ధరకే అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు షేక్ అలీం. పాతబస్తీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు జోలికిపోలేదు. ఎవరి దగ్గరా కూలీగా పనిచేయడం ఆయనకు ఇష్టం లేదు. సొంతంగా జీవిస్తూ ఇతరులకు ఉపాధి చూపాలనే సంకల్పంతో చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు.
అఫ్జల్‌గంజ్ బస్టాండు ఆవరణలో రూ.5కే బిర్యానీ అమ్మేందుకు పదిహేనేళ్ల క్రితం దుకాణాన్ని తెరిచారు. ఆ ధరకే సుమారు పదేళ్లపాటు అమ్మకాలు సాగించారు. అన్నింటి ధరలు బాగా పెరగడంతోపాటు నాణ్యమైన బియ్యంతో బిర్యానీ సరఫరాను రూ.5కే చేయాలంటే సాధ్యం కావట్లేదని బిర్యానీ ధరను రూ.10 చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అఫ్జల్‌గంజ్ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు, సమీప వ్యాపారులకు, ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులతోపాటు వారి బంధువులకు తక్కువ ధరకే బిర్యానీ అందిస్తూ ఆకలిబాధలు తీరుస్తున్నారు. రోజుకు సుమారు 2,000 నుంచి 2,500 మంది వరకు ఇక్కడ కడుపు నింపుకొంటున్నారు. కొందరైతే పొట్లాలు కట్టించుకొని ఇళ్లకు తీసుకెళుతున్నారు.