ఎల్లుండి భార‌త్ బంద్‌

253

ఇంధ‌నం ధ‌ర‌లు ప్ర‌తి రోజూ పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు బ‌తుకుదెరువు కోసం బండి మీద ప‌నుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి.

వ‌రుస‌బెట్టి 13 రోజులు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌లు సెంచ‌రీ దాటిపోగా.. మ‌రికొన్ని రాష్ట్రాల్లో చేరువ‌య్యాయి.

అయితే కొన్ని రాష్ట్రాలు సుంకాన్ని త‌గ్గించాయి. సామాన్యుడికి ఇబ్బందిగా ఉన్న ఇటువంటి ప‌రిస్థితుల్లో ట్రేడ్ యూనియ‌న్లు భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఎల్లుండి (ఫిబ్ర‌వ‌రి 26, 2021) బంద్ నిర్వ‌హించాల‌ని క‌న్ఫ‌డరేష‌న్‌ ఆఫ్ ఆలిండియా ట్రేడ‌ర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

దీంతో పాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌-ఏఐటీడబ్ల్యూఏ-AITWA) కూడా సంపూర్ణ మద్దతు పలికింది.

అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతిస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య చెప్పారు. 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

రహదారులు దిగ్బంధం చేస్తామని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఒకరోజు భారత్ బంద్‌కు వెళ్తున్నారు.

జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానం, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని, దేశమంతా డీజిల్ ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసింది సీఏఐటీ. జీఎస్టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-టెయిలర్స్.. ఈ-కామర్స్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది.

జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సర్కార్‌కు కొత్త సిఫారసులు చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. భారత్‌ బంద్‌కు దేశంలోని దాదాపు 40 వేల కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్న‌ట్టు సమాచారం.

బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఓవైపు కొనసాగిస్తున్నాయి.

ఇప్పుడు ట్రేడ్ యూనియన్లు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది.