పెట్రోలు, గ్యాస్, వంట నూనెల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.
ఇక ఈసారి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతుల నడ్డి విరగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దీంతో ఎరువుల బస్తాలకు రెక్కలు రానున్నాయి. ఎరువుల ధరలను భారీగా పెంచాలని సర్కార్ నిర్ణయించింది.
50 కిలోల ఎరువుల బస్తాపై రూ.100 నుంచి గరిష్ఠంగా రూ. 250 వరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎరువుల ధరలను పెంచాయి. మరికొన్ని కంపెనీలు వచ్చే నెల 1 నుంచి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి.
ఇప్పటి వరకు రూ. 890గా ఉన్న 20-20-0 రకం ఎరువుల బస్తా నిన్నటి నుంచి రూ. 998కి పెరిగింది.
రూ. 975గా ఉన్న ఈ బస్తా ఎమ్మార్పీ ఏకంగా రూ. 1,125కు పెరగడం గమనార్హం.
అలాగే, 1,275గా ఉన్న డీఏపీ బస్తా ధర రూ. 1,450కి పెరిగింది. పెంచుతున్న ధరల వివరాలను కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది.
మిగతా సంస్థలు మరో 15 రోజుల్లో ధరల పెంపును ప్రకటించనున్నాయి.