ఇక నుండి బేగంపేట స్టేషన్ .. పూర్తి మహిళా రైల్వేస్టేషన్

325
all women crew in begumpet railway station

ఇక నుంచి బేగంపేట రైల్వేస్టేషన్.. మహిళా రైల్వేస్టేషన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్ ని మహిళా రైల్వే స్టేషన్ గా ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వీకే యాదవ్ గురువారం బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా ప్రకటించారు. అంతేకాదు బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఇది వరకు ఉన్న ఉద్యోగులను ఇతర స్థానాలకు బదిలీ చేసి.. వారి స్థానంలో కేవలం మహిళలనే నియమించారు. టికెట్ల జారీ, తనిఖీలు, భద్రతతో పాటు పారిశుద్ధ్యాన్ని కూడా మహిళా ఉద్యోగులు నిర్వహించనున్నారు. 

మొత్తం 27మంది మహిళా ఉద్యోగులను బేగంపేట రైల్వే స్టేషన్‌కు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతున్న మహిళా ఉద్యోగికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యానగర్ స్టేషన్ కూడా మహిళా రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దినట్లు జీఎం వీకే యాదవ్ తెలిపారు. విజయవాడడివిజన్‌లోని రామవరప్పాడు, గుంటూరు డివిజన్‌లోని ఫిరంగిపురం రైల్వే స్టేషన్లను కూడా ఈ నెలాఖరులోగా మహిళా రైల్వే స్టేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు వీకే యాదవ్ స్పష్టం చేశారు.