మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత

277
all-accused-in-mecca-masjid-blast-case-have-been-acquitted-by-NIA-court

ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న మక్కామసీదు పేలుళ్ల కేసులో నేడు తుదితీర్పు వెలువడింది. నిందితులను కోర్టు కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేస్తుందన్న భావనలో ఉన్న బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. విచారణ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఐదుగురు నిందితులనూ నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.



మక్కామసీదులో పేలుళ్లు జరిగి 11 ఏళ్లు గడిచింది. ఈ కేసులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 10 మందిని నిందితులుగా గుర్తించింది. అందులో ఒకరు మృతి చెందగా, నలుగురిపై విచారణ కొనసాగుతోంది. మిగతా ఐదుగురిపై చార్జిషీట్లు దాఖలు చేయగా వారికి నేడు శిక్ష ఖరారు కావాల్సింది. అయితే ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం ఈ కేసులో తీర్పునిస్తూ.. సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటిచింది. ఛార్జిషీట్లు దాఖలైన ఐదురుగురినీ నిర్ధోషులుగా ప్రకటించింది. అయితే మిగిలిన నలుగురిపై ఛార్జిషీటు కొనసాగుతుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎన్నో మలుపులు.. సంచలనాలతోపాటు స్థానిక పోలీసుల నుంచి సీబీఐ, ఎన్‌ఐఏ సంస్థలు దర్యాప్తు చేశాయి. వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా విచారణానంతరం వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఎట్టకేలకు నిందితులుగా తేలిన వారిలో ఐదుగురిని కూడా ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్ధోషులకు ప్రకటించడం విశేషం.

2007 మే 18న శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. అనంతరం ఘర్షణలు చెలరేగడంతో పోలీసు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. మొత్తం 14 మంది మృతి చెందగా… 58 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఐఎస్‌ఐ ఏజెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. హుజీ కమాండర్‌ షాహెద్‌ బిలాల్‌ బంగ్లాదేశ్‌.. లేదా పాకిస్థాన్‌ నుంచి వ్యూహం రచించి పేలుళ్లకు పాల్పడ్డాడని అప్పట్లో ప్రచారం జరిగింది.


తొలుత హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీబీఐకి బదిలీ చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన 100 మందికి పైగా యువకులను అరెస్టు చేసి విచారించారు. ఐఎస్‌ఐ ఏజెంట్ల పనేనని దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్టు చేసిన వారిలో 21 మందిపై చార్జిషీట్లు దాఖలు చేశారు.

నిందితులు కాదు.. నిర్ధోషులు
నిందితులుగా ఉన్న వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునీల్‌ జోషి (ఆరెస్సెస్‌ మాజీ ప్రచారక్‌) కేసు విచారణలో ఉండగానే హత్యకు గురయ్యాడు. సందీప్‌ వి డాంగే (ఆరెస్సెస్‌ మాజీ ప్రచారక్‌), రామ్‌చంద్ర కల్‌సాంగ్రా (ఆరెస్సెస్‌ కార్యకర్త) ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అదే రాష్ట్రానికి చెందిన తేజ్‌రామ్‌ పర్‌మార్‌, అమిత్‌ చౌహాన్‌పై విచారణ కొనసాగుతోంది. రాజస్థాన్‌కు చెందిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దేవేంద్రగుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌శర్మ, గుజరాత్‌కు చెందిన స్వామి ఆసిమానంద, ఓ ప్రైవేట్‌ ఉద్యోగి భరత్‌ మోహన్‌లాల్‌ రాతేశ్వర్‌, రాజేందర్‌ చౌదరిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. బాధితులతోపాటు 226 మంది సాక్షులను విచారించి 411 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. వాటి ఆధారంగా నాంపల్లిలోని నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి(ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం)తీర్పును వెలువరించారు. ఛార్జిషీటు దాఖలైన ఐదుగురు నిందితులను నిర్ధోషులుగా ప్రకటించారు. మిగిలిన నలుగురిపై ఛార్జిషీటు కొనసాగుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

తాజా తీర్పులో నిర్ధోషులుగా తేలింది వీరే..
1. దేవేందర్ గుప్త
2. లోకేశ్ శర్మ
3. స్వామి ఆసిమానంద
4. భరత్ బాయ్
5. రాజేందర్ చౌదరి