పోరాడి గెలిచిన కొదండరాం : జన సమితి సభ కు హైకోర్ట్ అనుమతి

512
high-court-allows-janasamithi-first-public-meeting

తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ తెలంగాణ జన సమితి తన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఎన్నో నిర్బంధాలను అధిగమించి రాచరిక పాలనపై పోరాడి గెలిచింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ నెల 2న ఏర్పాటైన పార్టీ తెలంగాణ జన సమితి. తదనంతరం ఆ పార్టీ 29న ఆవిర్భావ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకొని ఏ్రపిల్ 4న దానికి సంబంధించిన పోస్టర్, కరపత్రము, జెండాను ఆవిష్కరించింది. ఈ విషయమై సరూర్ నగర్ గ్రౌండు ఎంపిక చేసికొని పోలీసుల అనుమతి కోరింది. వాహనాల కాలుష్యమంటూ, ట్రాఫిక్ సమస్యలంటూ అనుమతిని నిరాకరించింది.



 

కొత్త పార్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న దశలో తెలంగాణ సర్కారు కత్తిగట్టింది. జన సమితి ఆవిర్భావ సభ జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నవేళ సభకు అనుమతి నిరాకరించింది అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆవిర్భావ సభ అనుమతి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన జన సమితి తుదకు న్యాయస్థానం మెట్లెక్కింది. తమ సభకు అనుమతి ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. దీంతో హైకోర్టు జన సమితి అభ్యర్థనను స్వీకరించి ప్రభుత్వ వివరణ కోరుతూ తీర్పు నేటికి వాయిదా వేసింది. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ అనుకున్నట్లుగానే ఈనెల 29న జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈనెల 29న సరూర్ నగర్ మైదానంలో జన సమితి ఆవిర్భావ సభ జరిపేందుకు జన సమితి శ్రేణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సభ కోసం ఎల్ బి నగర్ డిసిపికి, కలెక్టర్ కు, రాచకొండ సిపికి దరఖాస్తు పెట్టుకోవాలని జన సమితి సభ్యులకు సూచించింది హైకోర్టు. వారు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


 

తెలంగాణ వచ్చిన తర్వాత జెఎసి నేతృత్వంలో అనేక ఆందోళనలు చేపట్టారు కోదండరాం. కానీ ఆయన ఏ నిరసన కార్యక్రమం చేద్దామన్నా తెలంగాణ సర్కారు కాలు కదలనీయలేదు. ఇంట్లో నుంచి బయటకొస్తే అరెస్టు చేసింది. హైదరాబాద్ పొలిమేరలు దాటనీయకుండా పోలీసు బలగాలను అడ్డం పెట్టింది. ఒకసారైతే ఇంట్లో ఉన్నా తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసేసింది. ప్రతి సందర్భంలో జెఎసి కోర్టుల్లో అనుమతులు తెచ్చుకుని సభలు, సమావేశాలు, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అవే ఆంక్షలు కొనసాగించింది సర్కారు. దీంతో కోదండరాం సర్కారు వైఖరిపై న్యాయపోరాటం చేసి తొలి విజయాన్ని నమోదు చేశారు.

మరి ఈనెల 29న జరిపే సభకు ఎంతవరకు జనాలను కదిలిస్తారు? ఒకవేళ పోలీసులు గతంలో మాదిరిగా ఈ సభకు కూడా జనాలు రాకుండా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.