వాయు కాలుష్య నియంత్రణ జరిగేనా ?

203
air pollution control

ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం వలన సగటు మానవుని జీవితకాలంలో 2 సంవత్సరాలు తగ్గుతుండటంతో, దేశరాజధాని అయినటువంటి ఢిల్లీలో 17 సంవత్సరాలు తగ్గుతుందని నిపుణులు వెల్లడించడం చూస్తుంటే… దానితీవ్రత ఏమేరలోనున్నదో అర్థంకాక మానదు.

అలాగే భయంకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత వాయుకాలుష్యానికి గురవుతున్న 20 నగరాలలో,మన దేశానికి చెందిన 13 నగరాలు ఉండటం.2017లో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలమంది చనిపోతే అందులో ఎక్కువగా భారతదేశం,పాకిస్తాన్ కు చెందిన ప్రజలు వాయుకాలుష్యం కారణంగా చనిపోవడం,ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం చూస్తుంటే సగటు వ్యక్తిని భయాందోళనలకు గురిచేయకమానని  పరిస్థితి.

శీతాకాలం వస్తుందంటేచాలు మహానగరం అంతా విషవాయువులతో మునిగి ప్రజలను తీవ్రఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది గత 30 సంవత్సరాల నుండి ఇలాగే కొనసాగుతుంది. కానీ ఇప్పటివరకు పరిష్కార మార్గాలను చేపట్టకపోవడం అనేది ప్రభుత్వాల వైఫల్యంగా  చెప్పకతప్పదు.అంతెందుకు ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్ సైతం అత్యంత వాయుకాలుష్యానికి గురికాగా ప్రస్తుతం సాధారణ స్థితికి తీసుకువచ్చారు అంటే అక్కడి ప్రభుత్వాలు అమలుపరిచే విధానాలే దానికి నిదర్శనం.

దేశంలో ఉత్తరభారతదేశాన్ని వాయుకాలుష్యం  ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గాలిలో సాధారణంగా ఆక్సిజన్,నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఉంటాయి. కానీ ఇక్కడిగాలులలో అదనంగా బ్లాక్ కార్బన్,సల్ఫర్ డయాక్సైడ్,నైట్రోజన్ ఆక్సైడ్,సల్ఫర్ లాంటి విషవాయువులు చేరి అక్కడిప్రజలకు గుండెపోటు,బ్రెయిన్ స్ట్రోక్,దగ్గు,గొంతుమంట,ఊపిరి ఆడకపోవడం,చాతిలోనొప్పి లాంటి అనారోగ్యాల బారిన పడాల్సివస్తుంది.

ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు,వృద్ధులు, అస్వస్థతకు గురికావలసివస్తుంది.నవజాత శిశువుల మరణాల్లో 21శాతానికి కారణంకాగా,2010నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదుకోట్లమంది గృహసంబంధ కాలుష్యం బారినపడ్డారంటే కాలుష్యం ఏమేరలో హానికలిగిస్తుందో తెలవకమానదు. అందుకే ఢిల్లీలాంటి నగరాలలో స్వచ్ఛమైన గాలికోసం “ఆక్సిజన్ చాంబర్స్”వెలుస్తున్నాయి అంటే భవిష్యత్తును ఊహించుకుంటేనే భయపడకతప్పని పరిస్థితి దాపురిస్తుందనడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

వాయుకాలుష్యానికి గల కారణాలను విశ్లేషిస్తే…. ముందుగా వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి గాలిని ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్’ప్రామాణికంతో కొలుస్తారు.

AQI 0-50 పాయింట్లు ఉంటే స్వచ్ఛమైనగాలి అని,51-100 పాయింట్లు ఉంటే పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది ఉండదని,101-150 పాయింట్లు ఉంటే ఆస్తమాలాంటి వ్యాధులు ఉన్నవారికి ప్రమాదమని,151-200 పాయింట్లు ఉంటే గాలిని పీల్చుకోవడం ఎవరికీ మంచిదికాదని,201-300 పాయింట్లు ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందని,301-400 పాయింట్లు ఉంటే అసలు ఈగాలి పీల్చుకోకూడదని వాతావరణ నిపుణులు తెలియజేస్తుంటారు. AQI 500 పాయింట్లు దాటితే హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తారు. అందుకే 2017లో 837. 7పాయింట్లు రికార్డ్ కావడంతో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.

అందుకే ఢిల్లీ ప్రభుత్వం సైతం మరల హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం,యాంటీ పొల్యూషన్ మాస్కూలను పెట్టుకొని బయట తిరగడం,పాఠశాలలకు వరుసగా సెలవులు ప్రకటించడం,కాలుష్యనివారణకు చర్యలు తీసుకోవడం జరిగింది.

2.5కోట్ల జనాభాకలిగిన దేశరాజధానిలో కోటి పదిలక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. అందులో దాదాపు ప్రతిరోజు 30లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతూ ఉంటాయి. మంత్రుల కాన్వాయ్,పలురాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులరాక,వాహనాల సందడి ఉండటం ఒకెత్తయితే ప్రతివెయ్యి మందికి 598వాహనాలు ఉన్నాయని,ప్రతిరోజు నూతనంగా1400కార్లు రోడ్డుపైకి వస్తున్నాయని,గత పది సంవత్సరాలకాలంలో మూడురెట్లు పెరిగాయి.

రోడ్డురవాణాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.కాన్పూర్ ఐఐటి వారు జరిపిన పరిశోధనలు వాయుకాలుష్యం… వాహనాల ద్వారా 36శాతం,వాహనాల ఉద్గారాల ద్వారా 25 – 36శాతం,వంటగదుల నుండి 22శాతం, పరిశ్రమలు,విద్యుత్ ఉత్పత్తికేంద్రాల ద్వారా 22శాతం దోహద పడగా పంటవ్యర్థాలు అదనంగా తోడయ్యాయని వెల్లడించింది.

అలాగే నగరం చుట్టుపక్కల 25పవర్ ఫ్యాక్టరీలు ఉండగా  అందులో 19ఫ్యాక్టరీలలోAQI 900పాయింట్లు ఉన్నాయని,పెద్ద పెద్ద హోటల్,రెస్టారెంట్స్ లలో చార్కోల్ తో వంటలువండటం,భవననిర్మాణం,భారీ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా గాలిలో ధూళి,దుమ్ము కలవడం,శీతాకాలంలో చలిమంటలు ద్వారా సైతం పొగ వాతావరణంలో కలవడం జరుగుతుంది.

దేశంలో హర్యానా,పంజాబ్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో నీటిపారుదల అత్యధికంగా ఉండటంతో అక్కడ గోధుమ,వరి,చెరుకు లాంటి పంటలను పండించడం,తర్వాతి పంటలకోసం భూమిని చదునుచేసే విధానంలోభాగంగా గడ్డినికాల్చడం,దీనిద్వారా ప్రతిసంవత్సరం 2.5కోట్ల కార్బన్ డయాక్సైడ్ ఏమిషన్స్ గాలిలో కలవడం, ఇవన్నీ వాతావరణంలోకలిసి ఢిల్లీవైపు ప్రయాణించడం వాయుకాలుష్యానికి దారితీస్తుంది.

ఇక్కడ ఆశ్చర్యకర విషయాలు ఏమిటంటే అక్కడి ప్రభుత్వాలు గడ్డిని తగలబెడితే హెక్టారుకు 2500 రూపాయల జరిమానా విధించడానికి పూనుకుంటే, ఎకనామిక్ స్టడీ ఆఫ్ సర్వే గణాంకాలప్రకారం ఒకహెక్టారు గడ్డిని తొలగించడానికయ్యే ఖర్చు 3500రూపాయలవుతుంది.అందుకే ఒక్కరూపాయి అగ్గిపెట్టెతో తగలబెట్టి, జరిమానా కట్టడానికి సైతం వెనకాడటంలేదు. మరొకకారణం చూస్తే..గోధుమ,వరి,పంటలను ఎక్కువ పండించడానికిగల కారణం.. ఆహారపంటలు పండిస్తే ప్రభుత్వంవద్ద మిగులు ఎంతఉన్నా, కనీస మద్దతుధర ప్రకటించి రైతులవద్ద ఈపంటలను కొనాల్సిందే. అందుకే ఈపంటలు పండించడానికి పూనుకుంటున్నారు. ఈ మిగులుధాన్యాన్ని ప్రభుత్వం విదేశాలకు సబ్సిడీలు కల్పించి తక్కువధరలకే అమ్మడం మరోవింత.

ఢిల్లీకి 700కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాలు ఉంటే థార్ ఎడారి నుండి ఇసుక,దుమ్ము,ధూళి రాకుండా కాపాడేవి. కానీ మార్బుల్ మైనింగ్ పేరుతో ఇప్పటికే 31కొండలను నామరూపంలేకుండా చేయడంతో,దుమ్ము,ధూళి,ఇసుక సైతం వాతావరణంలో కలిసి వాయుకాలుష్యాన్ని ఇంకా జఠిలంచేస్తున్నాయి.

పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వారు ఉపగ్రహాల సహాయంతో ఛాయాచిత్రాలను తీసి పరిశీలిస్తే… పాకిస్తాన్ సరిహద్దుగ్రామాల్లో, పంజాబ్,హర్యానా రాష్ట్రాలలో వేలాది ఎకరాలలో పంటపొలాల వ్యర్ధాలను కాల్చివేయడం గుర్తించడం జరిగింది.అంటే ఇలా వివిధకారణాలచేత వాయుకాలుష్యం ఏర్పడి,ఢిల్లీ మహానగరాన్ని ముంచెత్తి శీతాకాలం వచ్చిందంటేచాలు ఉదయం 11 గంటలు దాటాకసైతం వాయుకాలుష్యంతో కూడిన మంచుతో దర్శనమిస్తూ ప్రజలను వివిధ అనారోగ్యాలబారిన పడేస్తుంది.

ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు జీవించేహక్కును కాపాడాలని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వస్తున్నది. అందుకే ఢిల్లీ ప్రభుత్వం సరిబేసి విధానం ప్రకటించి సరిసంఖ్య నెంబర్ కలిగిన వాహనాలు ఒకరోజు, బేసిసంఖ్య నెంబర్ కలిగిన వాహనాలు మరుసటిరోజు రోడ్డుపై తిరిగేలా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ నిర్ణయాన్ని అతిక్రమిస్తే జరిమానాలు విధించడం చేస్తున్నారు.

అలాగే మాస్కులను అందజేయడం,పాఠశాలలకు వరుససెలవులు ప్రకటించడం పంటవ్యర్ధాల నిషేధానికి నగదుపథకాలు భవననిర్మాణ,రోడ్డునిర్మాణ పనులను నిలుపుదలకు పూనుకోవడంలాంటి పనులు నిర్వర్తించిన.. ఇవన్నియు తాత్కాలిక పరిష్కారమే చూపుతున్నాయనడంలో ఎలాంటి అబద్ధంలేదు.

దేశ రాజధానిలో తక్షణమే చేయాల్సిన పనులు

  • మెట్రోను పునరుద్ధరించి,వీలైనన్ని ఎక్కువ రైళ్లను నడుపుతూ,ప్రయాణికుల సొంత వాహనాల మీద ఆధారపడకుండా సౌకర్యాలు కల్పించాలి.
  • డీజిల్ మరియు పెట్రోల్ తో నడిచే వాహనాలను నిషేధించి,విద్యుత్,CNGతో నడిచేవాహనాలకు ప్రాముఖ్యత నివ్వాలి.
  • వీలైనన్ని తక్కువ వాహనాలు నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలి.
  • చెత్తను తగలబెడితే జరిమానా విధిస్తూ, ప్రభుత్వానికి సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించాలి.
  • చెత్తను పడేయడానికి గుంతలుతవ్వి, తక్షణమే మూసివేయాలి.
  • సోలార్ వినియోగాన్ని పెంపొందించాలి.
  • రహదారులను పునరుద్ధరించి,ప్రభుత్వమే ప్రజారవాణాకు పూనుకోవాలి.
  • వ్యర్ధాలను వెదజల్లే ఫ్యాక్టరీలపై కఠినచర్యలు తీసుకోవాలి.
  • దగ్గరగాఉండే ప్రాంతాలకు వెళ్లడానికి నడకతో లేదా సైకిళ్లను మాత్రమే ఉపయోగించాలి.
  • ఖాళీస్థలాలలో వీలయినన్ని చెట్లనునాటి,పెంచి పోషించాలి.
  • అత్యవసర ఆరోగ్యసేవలో మినహా, జనరేటర్ వాడకాన్ని రద్దుచేయాలి.
  • సోలార్,విద్యుత్,గ్యాస్తో పనిచేసే పొయ్యిలను వాడాలి.
  • కొద్దికాలంపాటు ఇటుకబట్టీల నిర్మానాలను ఆపి వాయుకాలుష్య నివారణకు శాస్త్రీయమార్గాలను చేపట్టాలి.
  • ప్రధాన నగరాలలో పటాకుల కాల్చడాన్ని శాశ్వతంగా నిలిపివేయాలి.

అంతేగాని అధికారపక్షం, ప్రతిపక్షం ఒకరిపైమరొకరు నిందలు మోపుకోవడానికో, ఎన్నికలలో గెలవడానికో, ప్రజలను  మభ్యపెట్టడానికో తాత్కాలిక పరిష్కారాలు చూపడం సరి అయినది కాదు. ప్రభుత్వ ఆరోగ్యసంస్థ వెల్లడించిన గణాంకాలను పరిశీలించి విశ్లేషణ గావించి, పర్యావరణ, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి సంస్థల సహకారంతో, నిపుణలతో చర్చించి దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారానికి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

దేశంలో నెలకొన్న అత్యున్నత న్యాయస్థానం ప్రకటనలను పెడచెవిన పెట్టకుండా వెంటనే ప్రణాళికాయుతంగా అమలు పరచాల్సిన ఆవశ్యకత ఉన్నది.వీలైనంత త్వరలో కాలుష్యనివారణ విజయవంతం కావాలని ఆశిద్దాం.