ఆధార్ కార్డు రాజ్యాంగబద్దమైనదేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం విదితమే. ఆధార్‌తో సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపు లభించిందని, దాంతో వారికి సాధికారత వచ్చిందని అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. అలాగే ఏ ప్రైవేటు కంపెనీకి కూడా పౌరుల ఆధార్ వివరాలను వెల్లడించరాదని కూడా సుప్రీం కోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
అయితే మిగతా సేవల మాట ఎలా ఉన్నప్పటికీ ఆధార్‌ను మాత్రం ఈ మూడు సేవలకు కచ్చితంగా వినియోగించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
* దేశంలో నకిలీ పాన్ కార్డులను ఇబ్బడి ముబ్బడిగా సృష్టించి పన్ను కట్టకుండా చాలా మంది తప్పించుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆధార్‌ను పాన్ కార్డులతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
* ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పొందేందుకు కూడా పౌరులు తమ ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
* ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి అయిన నేఫథ్యంలో పౌరులు తమ ఆదాయపు పన్ను వివరాలను సమర్పించేటప్పుడు (ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్) కూడా ఆధార్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
పైన చెప్పిన మూడు సందర్భాల్లో పౌరులు తమ ఆధార్ వివరాలను కచ్చితంగా ఇవ్వాలి. మిగిలిన సేవలను పొందేందుకు ఆధార్‌ను అనుసంధానించాల్సిన పనిలేదు. అయితే పీఎఫ్ చందాదారులు తమ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించడంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.