ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లాలోని స్పీకర్ స్వగ్రామం ఆముదాల వలస నియోజకవర్గం తొగరాం పంజాయితీ ఎన్నికల్లో వాణి భారీ మెజార్టీతో గెలుపొందారు.
గ్రామంలో మొత్తం 1,118 ఓట్లు నమోదు కాగా.. వాణికి 808 ఓట్లు వచ్చాయి. ఆమెకు 72.22 శాతం ఓట్లు పడినట్టయింది. మొత్తం మీద ఆమె 510 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈ ఎన్నికల్లో స్పీకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో భాగంగా స్వగ్రామం తొగరాంలో ఓటు వేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పంచాయితీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ ప్రజల తీర్పు ఏక పక్షంగా ఉందని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు పూర్తయిన తొలి రెండు విడతల్లో వైసీపీ మద్దతుదారులే అధిక సంఖ్యలో గెలవడంతో తమ ప్రభుత్వానికి ప్రజల అండ ఉన్నట్లు నిరూపితమైందని చెప్పారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్సీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని స్పీకర్ అన్నారు.
తన భార్య సర్పంచ్‌గా పోటీ చేయడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆమెను బరిలోకి దింపాల్సివచ్చందని చెప్పారు.
నా భార్యకు ఓటేయమని తాను ఎక్కడా ప్రచారం చేయలేదని పేర్కొన్నారు.
తన స్వగ్రామం తొగరాం అని ఇక్కడ తనకు కూడా ఓటు హక్కు ఉందని తెలుసుకుంటే మంచిదని కొందరిని ఉద్దేశించి చెప్పారు.
ఇక్కడ తప్ప మరెక్కడా తనకు ఓటు హక్కు లేదని కూడా తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.