కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సిబ్బంది వేతనాల విషయంలో తీవ్రస్థాయిలో స్పందించారు.
సిబ్బంది శ్రమతో కోట్ల రూపాయలు సంపాదించుకుని వారిని రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు.
ప్రైవేటు విద్యాసంస్థలు సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని స్పష్టం చేశారు.
మీ సిబ్బందితో చర్చించుకుని సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. లేదంటే అధ్యాపకులు, ఉపాధ్యాయుల తరఫున బీజేపీ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మూడు నెలల క్లాసుల కోసం ఏడాది మొత్తానికి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు సిబ్బందికి జీతాలు ఎందుకివ్వరని నిలదీశారు.
కార్పొరేట్ కాలేజీల చరిత్ర మా వద్ద ఉందన్నారు. చరిత్ర తవ్వడం ప్రారంభిస్తే మీ గతి మారిపోతుందని హెచ్చరించారు.
జీతాలు ఇవ్వాలని కోర్టు చెప్పినా కార్పొరేట్ విద్యాసంస్థలు ఆ ఆదేశాలను పట్టించుకోవడంలేదని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పెద్దలు కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దన్నారు.