కేంద్ర వార్షిక బడ్జెట్-2021పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూఎన్నికలున్న ఐదు రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల బడ్జెట్‌ను కేవలం ఐదు రాష్ట్రాలకు ఇవ్వడం దారుణమన్నారు.
తెలంగాణకు బడ్జెట్ లో మొండిచేయి చూపారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పడానికి ఈ బడ్జెటే నిదర్శనమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపిల వల్ల ఎటువంటి లాభం లేదన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు ఒక్కటి కూడా బడ్జెట్‌లో ప్రస్తావన చేయలేదని విమర్శించారు.
రైతులు ఆందోళన చేస్తుంటే కనీస మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదని అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్ తో పాటు బుల్లెట్ రైలును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు.