కుక్క కోసం వెక్కి వెక్కి ఏడ్చిన హెడ్ కానిస్టేబుల్

241
Police dog Lucky for outstanding service to the Police Department

నల్లగొండ : అది ఒక శునకం…. శిక్షణ పొందిన సుశిక్షతమైన శునకం…. అందుకే పోలీసులతో సమానంగా ఎన్నో కేసులను చేధించడంలో కీలకంగా పని చేసి నల్లగొండ జిల్లా పోలీసుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటి ఉన్నతాధికారులతో శభాష్ అనిపించుకుంది…..

పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన లక్కీ

పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన ఆ శునకం సోమవారం నేలకొరగడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా పోలీస్ శాఖలో స్నిప్పర్ డాగ్ గా సేవలదించి వాసన పసిగట్టడంలో దిట్టగా పేరు సంపాదించి ఎన్నో కీలకమైన కేసులలో, ప్రముఖులు, విఐపిల బందోబస్తులలో తన సేవలందించి అందరి ప్రశంశలు పొందింది. ఎన్నో సేవలందించిన ఆ శునకానికి సోమవారం అధికారిక లాంఛనాలతో సెల్యూట్ చేసి, బ్యాండ్ మేళంతో అంత్యక్రియలు పూర్తి చేసి నివాళులర్పించారు ఏ.ఆర్. పోలీసులు.

పోలీసుల ప్రాణాలను కాపాడిన లక్కీ

నల్లగొండ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పెద్ద ఎత్తున ఉన్న సమయంలో పోలీసులు లక్ధ్యంగా పెట్టిన ల్యాండ్ మైన్లను వాసన ద్వారా పడిగట్టి వాటిని గుర్తించి వందలాది మంది పోలీసుల ప్రాణాలను కాపాడడంలో కీలకంగా పనిచేసింది ఈ లక్కీ…. 30 డిసెంబర్ 2013లో దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కంభాలపల్లి గ్రామంలో దాచిన నాటు బాంబులను గుర్తించి విధ్వసం జరగకుండా కాపాడగలిగింది. అదేవిధంగా 3 మే 2014 సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో పోలీసులను టార్గెట్ చేసి నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్లను గుర్తించి పోలీసుల ప్రాణాలను కాపాడింది. ఇక ప్రముఖుల పర్యటనలు, విఐపిల బందోబస్తులోను గత తొమ్మిది సంవత్సరాలుగా సేవలందించింది ఈ శునకం.

Dog named Lucky

కంటతడి పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ శివ కుమార్

శునకాన్ని సుశిక్షితంగా తీర్చిదిద్ది తొమ్మిది సంవత్సరాలుగా దాని సంరక్షణ బాధ్యతలు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్కీ మరణంతో రోధిస్తున్న దృశ్యం అందరిని కంటతడి పెట్టుకునేలా చేసింది. తొమ్మిది ఏళ్లుగా తన కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటూ మమేకమైన శునకం మరణం తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తొమిదేళ్ల కాలంలో లక్కీ అందించిన సేవల ద్వారా తనకు ఎన్నో రివార్డులు తెచ్చిపెట్టడమే గాక జిల్లా పోలీసు శాఖ గౌరవాన్ని పెంచిందని చెప్పారు. లక్కీ మరణంతో తన కుటుంబం సైతం దుఃఖంలో మునిగిపోయిందని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పాడు శివకుమార్