నిబద్ధతను చాటుకునే ప్రభుత్వం కావాలి

271
need a committed government

ఏ దేశంలోనైనా వివిధ రాష్ట్రాలలో పలు రాజకీయపార్టీలు ఉండటం సహజం. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు పలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం, గెలుపొందడానికి నిందారోపణలు చేసుకోవడం జరుగుతుంది. చివరగా ఓటర్లు ఏదో ఒక పార్టీకి అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఆతర్వాత పరిపాలన గావిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల వైపునుండి గాని, మేధావుల నుండి గాని ఏమైనా విమర్శలు, నేరారోపణలు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉండే రాజకీయపార్టీ ప్రతివిమర్శ చేయకుండా వారన్నదాంట్లో నిజంలేదని నిబద్ధతతో రుజువుచేసుకుంటూ, జవాబుదారీతనంతో పరిపాలనగావించినట్లయితే పదికాలాల పాటు మనుగడసాగించడానికి వీలుంటుంది. అంతేగాని వాటికి ప్రతిస్పందించకుండా, మౌనంగా ఉంటే “మౌనం అంగీకారానికి నాంది ” అనేలా తప్పు ఒప్పుకున్నట్లవుతుంది.

దశాబ్దంపైగా సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రపోరాటం, ఎందరో విద్యార్థుల ఆత్మబలిదానాలు, యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది. అంతేగాని ఏఒక్కరి వల్లనో, పార్టీవల్లనో వచ్చింది కాదన్న విషయం నూటికినూరుపాళ్లు నిజమని ఒప్పుకోకతప్పదు. ఏది ఏమైనా ఉద్యమ పార్టీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి రాష్ట్రప్రజలు పట్టం కట్టే అధికారంఇచ్చి, ఆశల నెరవేరనకు ఎదురు చూశారు. కానీ ఎన్నికల సమయాలలో వారు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఆశించినస్థాయిలో నెరవేరలేదన్నది ముమ్మాటికి నిజం.

అయినా  “ఇల్లు అలకగానే పండగ కాదు” అనే సామెత మాదిరిగా మరికొంత సమయం కావాలని కోరితే రెండవసారి సైతం రాష్ట్రప్రజలు ఆశీర్వదించి పట్టంకట్టారు. అయితే ఈ ఆరున్నరఏళ్ళ పరిపాలనకాలంలో అధికారపార్టీ నాయకులపైన ప్రతిపక్షాలు, మేధావులు తీవ్రవిమర్శలు చేస్తూవస్తున్నారు. కానీ ప్రభుత్వం వాటినేమీ పట్టించుకోకుండా, తమ పని తాము చేసుకుంటూ పోతుంది.అంటే విమర్శలలో నిజం ఉన్నదా?అందుకే ప్రభుత్వం స్పందించడం లేదా? అనే పలుప్రశ్నలకు దారితీస్తుందనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. ప్రభుత్వపాలన పనితీరు సైతం అదేకోవలో పనిచేస్తుందా? లేనిచో జవాబుదారీ తనంతో ప్రజలకు తమ నిబద్ధతను చాటుకుంటూ రుజువు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

కొన్ని విమర్శలను పరిశీలిస్తే….

తెలంగాణ వచ్చాక దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించి, మాట తప్పను మడమతిప్పను అనిచెప్పి, ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండని బహిరంగంగా ప్రకటించి మాటతప్పారు. ఎందుకలా చేశారు?ప్రజలకు చాటి చెప్పాల్సినవసరం ఎంతైనా ఉన్నది.

ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ, దళితులకు ఉచిత భూపంపిణీ, కేజీ టు పీజీ విద్య, రెండు పడకగదుల ఇళ్లనిర్మాణం ఏమైపోయాయి.. వాటికి గల కారణాలను నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

మొదటిదఫా ప్రభుత్వంలో అరకొర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ నుండి మొదలుకుంటే ఫలితాలు ఇచ్చేవరకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడి కోర్టుమెట్లు ఎక్కడానికి గలకారణాలు ఏంటి?

రాష్ట్రప్రభుత్వం ప్రజలందరినీ, ప్రతి గ్రామాన్ని, జిల్లాను సమానంగా, నిష్పక్షపాత ధోరణితో చూడాలన్న విషయం జగమెరిగిన సత్యం. అలాంటిది సాక్షాత్ ముఖ్యమంత్రిగారి స్వగ్రామమైన చింతమడక గ్రామంలో సందర్శించి కుటుంబానికి 10లక్షల చొప్పున ప్రకటనచేయడం దేనికినాంది?

అంతెందుకు మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికలలో భాగంగా కేవలం ఆ ఒక్కనియోజకవర్గానికి మాత్రమే రైతుబంధు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి? హైదరాబాదు నగరాన్ని ప్రపంచ సుందరంగా మారుస్తానని ఎన్నోవేదికల సాక్షిగా ప్రకటించి, వర్షాల కారణంగా డ్రైనేజీలు ఉప్పొంగి, సముద్రాలను తలపించే విధంగా తయారైనప్పుడు కాకుండా జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు వరదబాధితులకు 10,000 ప్రకటించడం, అదికూడా కేవలం అధికార పార్టీకిచెందిన వారికేనని, అందులో సైతం కమిషన్ తీసుకున్నారని విమర్శలు వచ్చాయి, వాటికి ఏది  ప్రతిస్పందన?

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అకాలమరణం చోటుచేసుకున్నాక, ఉపఎన్నిక నేపథ్యంలో హాలియాలో డిగ్రీకాలేజీ మంజూరును ఎలా అర్థంచేసుకోవాలి?

సిద్దిపేట,వరంగల్,ఖమ్మం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట బహిరంగ సభలో వరాలజల్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఖమ్మంలో ఐటి పార్కు, వరంగల్ కు సైతం విమానాశ్రయం, ఐటిహబ్, ఇండస్ట్రియల్ కారిడార్ అంటే దీన్నిఎలా అర్థంచేసుకోవాలి?

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ 2 గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో సాంకేతిక లోపాలతో కూడిన ఉద్యోగ నియామకాలు అనే విమర్శలు మారుమోగుతున్నాయి. అంటే ఇదినిజమేనా?

ఇంకా భారీనీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని అన్నిపార్టీలు విమర్శిస్తున్నాయి. వాస్తవాలతో తమనిబద్ధతను చాటుకునేదేప్పుడు?

ప్రభుత్వ పరంగా ఏనిర్ణయం తీసుకున్నా, ఏ పథకం ప్రవేశపెట్టిన కోర్టుపరిధిలోకి వెళ్లి, కోర్టుచే పలుమార్లు మందలింపులకు గురికావడం దేనికి నిదర్శనం? ఇంకా అధికారపార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు వివిధ దినపత్రికల్లో వార్తలు అచ్చవుతున్నాయి. ఇక్కడ కూడా మౌనం ప్రదర్శిస్తే అంగీకరించినట్లే కదా! ఇంకెప్పుడు  నిరూపణ గావిస్తారు?

వివిధ మాధ్యమాల ద్వారా మరియు పలు రాజకీయపార్టీలు చేసే విమర్శలు సగటు తెలంగాణవాదిని ఎన్నో అనుమానాలకు గురిచేస్తుంది. అందుకే ఈమధ్య జరుగుతున్న ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

ఒకప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ఎమ్మెల్యేలకు అకాల మరణాలు సంభవించాలా ? ఇంకేమైనా ఎన్నికలు రావాలా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిచే మహాసభ ఏర్పాటుకావాలా? అనే పలువిమర్శలకు తావిస్తోంది. జరిగిన పరిణామాల దృష్ట్యా దీన్నెల ఖండిస్తారో ప్రజలకు చాటిచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది.

సమాచారరంగం, ప్రసారసాధనాలలో సాంకేతిక అభివృద్ధి జరిగి, సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువై, నూతనంగా ఎన్నో దినపత్రికలు వెలుగులోకివచ్చి, ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు, క్షణాలలో వార్తలు పంపడం, అతితక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తిచెంది సగటువ్యక్తిని ఎన్నో అనుమానాల బారినపడేయడం జరుగుతుంది.

విమర్శకూ  వివరణ ఇవ్వకపోతే వాటిని అంగీకరించినట్లవుతుంది. కావున ప్రజల అనుమానాలనివృత్తికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రప్రభుత్వం అంటే రాష్ట్రప్రజలందరికీ పెద్దదిక్కుగా వ్యవహరించే కన్నతండ్రి వంటిది. రాష్ట్ర ప్రజలందరూ బిడ్డలతో సమానం. అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. అంతేకానీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి కార్యకలాపాలకు పూనుకుంటాం అంటే అది పక్షపాతధోరణికి నాందిపలుకుతుంది. అలాగే ప్రజలతీర్పు సైతం బెడిసికొట్టే వీలుంటుంది.

కావున ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తూ, నిష్పక్షపాతధోరణితో పాలనగావిస్తూ, అవినీతి రహితంగా, నిస్వార్ధంగా అభివృద్ధి కార్యకలాపాలకు  పూనుకుంటూ, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏప్పుడైతే ప్రతిపక్షాలకు ప్రశ్నించే స్వాతంత్రం కల్పించి, హుందాగా వారి ప్రశ్నలకు సరైనసమాధానాలు ఇస్తూ ప్రజలను మెప్పించే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే అభివృద్ధివైపు అడుగులుపడే అవకాశం ఉంటుంది. కావున ఆదిశగా ప్రభుత్వం పయనించాలని  ఆశిద్దాం.

-డా.పోలం సైదులు