సమాచార హక్కు చట్టం – ఒక అవగాహన

487
Right to Information Act - An Awareness

నేటి ఆధునిక సమాజంలో అవినీతిని నియంత్రణ చేయడానికి సమాచార హక్కు చట్టమనేది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తున్నది. ప్రత్యేకంగా ఎన్నికలలో ప్రచారయాత్రలలో ఉపన్యాసాలివ్వడానికి, అవతలివారు చేసిన అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సమాచారహక్కు చట్టం ద్వారనే పొందుతున్నారు. ఇది సమాజాభివృద్ధికి ఎంతో దోహదబడుతున్న కేవలం విద్యావంతులు, రాజకీయ పక్షాలు, మేధావులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎప్పుడు సామాన్య మానవుడు ఈ చట్టాన్ని ఉపయోగిస్తాడో, అప్పుడు అధికారులు జవాబుదారీ తనంతో పనిచేస్తారు. అవినీతి నియంత్రణలోకి వస్తుందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.ఈ చట్టం యొక్క పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే..

రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి టెండర్ తీసుకోని ప్రభుత్వ భవనాన్ని నిర్మించాడు. అక్కడున్న కొంతమంది మహిళలు, అతని వద్దకు వెళ్ళి ఎన్ని ఇటుకలు వాడావు? ఎంత సిమెంటు వాడారు? ఏ రకం సిమెంటు వాడారు? ఎంత మందికి పని కల్పించావు? ఎన్ని రోజులు పని కల్పించారు? అను ప్రశ్నలకు సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నిలదీశారు. ఎవ్వరైనా ఈ మాటకు ఒప్పుకోరు ఎందుకంటే వారి నాసిరకం పని బయటపడుతుంది. అతను అలాగే చేయడంతో  MKSS మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే సంస్థగా ఏర్పడి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు కల్గించేదిలా ఉండాలి, అంతేగానీ అవినీతికి పాల్పడుతూ నాసిరకం పనులు చేయకూడదు, అయితే ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ప్రతి కార్యాలయంలోని అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని, అడిగిన ప్రతి సమాచారాన్ని ఇవ్వాలని, దానికి సైతం నిర్ణీత గడువులోగా ఇవ్వడానికి ప్రభుత్వమే ఒక యంత్రాంగాన్నీ ఏర్పాటుచేయాలని పోరాటం చేస్తూ, అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించే వారు, ప్రజలలో చైతన్యం కల్గించడానికి ‘ జన్ సున్ వాయి ‘ ( ప్రజా విచారణ ) పేరుతో  MKSS సమావేశాలు నిర్వహించి పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదువలేరని, చదివి వినిపిస్తూ, సమాచారం సేకరించి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళేవారు.

మొదటగా పనికి ఆహార పథకానికి సంబంధించి సమాచారం సేకరించేవారు. మొదట్ల ప్రభుత్వ అధికారులు సంబంధిత సమాచార పత్రాలను ఇవ్వడానికి నిరాకరిస్తే, దాదాపు మూడు సంవత్సరాలపాటు ప్రదర్శనలు , ఉరేగింపులతో నిర్విరామ పోరాటం చేసి, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి, రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ లో 1995 లో ఒక ప్రత్యేక చట్టాన్ని తేవడానికి కారకులయ్యారు. ఆ తర్వాత దశాబ్ద కాలం గడిచిన తర్వాత అందులోని మర్మాన్నీ గ్రహించిన కేంధ్ర ప్రభుత్వం 2005, అక్టోబర్ 12 న ‘సమాచార హక్కు చట్టాన్ని’ తెచ్చి, యావత్తూ దేశంలో అమలయ్యేవిదంగా యంత్రాంగాన్నీ తయారుచేయడానికి దోహదబడ్డారు.

ప్రస్తుతం సమాచార హక్కును రాజ్యాంగం రెండు ప్రాథమిక హక్కుల క్రింద – భావప్రకటన స్వేఛ్చ , జీవించే హక్కుగా గుర్తిస్తున్నారు .

ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాలు, నియమ, నిబంధనలు, హాజరు పట్టికలు, ఉత్తరాలు వంటివి పొందవచ్చు. ఈ సమాచారం కావాలనుకుంటున్న వ్యక్తి ఆ పత్రాల నకలు తయారుచేయడానికయ్యే ఖర్చు కోసం కొద్దీ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ సమాచారం కోరుకుంటున్న వ్యక్తి దారిద్యరేఖకు దిగువున ఉన్నట్లయితే ఈ మొత్తాన్నీ సైతం చెల్లించాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే అధికారి ఒకరుండాలి. వారు ఈ సమాచార అధికారిపైనా అపిలేట్ అధికారి ఉంటాడు, సమాచార అధికారి చర్య తీసుకునేలా ఈ పై అధికారి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసిన, అనుకున్న సమయంలోపు సమాచారం ఇవ్వకపోయిన ఆ అధికారిపైన పిర్యాదు చేస్తే, చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి.

RTI Act - An Overview

ఇలాంటి గొప్ప చట్టమున్నా దేశంలో అందరికి దీనిమీద సరైన అవగాహనలేక ఎక్కువగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ముక్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు అధికారులపై గల భయంతో కనీసం తెలుసుకోవడానికి కూడా సాహసించలేని పరిస్థితిని నేటికీ గ్రామ స్థాయిలో చూడవచ్చు. ఒకరిద్దరు వీటిని ఉపయోగించుకుంటే అధికారులు వీరితో మచ్చిక చేసుకోని, వారిని లీడర్లను చేసి, తమ మీదికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. కేవలం రాష్ట్ర స్థాయిలో కేంధ్ర స్థాయిలో ఉన్నత విద్యావంతులు, సంఘాల నాయకులు, రాజకీయనాయకులు ఈ చట్టాన్ని ఉపయోగించుకోని సమాచారాన్ని సేకరించి, అవగాహనా తెచ్చుకోని వివిధ పోరాటాలకు దిగుతున్నారు .

కానీ గ్రామ స్థాయిలో ఎప్పుడైతే సామాన్య మానవుడికి ఈ చట్టం పట్ల అవగాహనా కల్పించి, దీన్ని ఉపయోగించుకోని అధికారులపై జవాబుదారీతనాన్ని పొందుతాడో సంపూర్ణంగా అవినీతిని నిర్మూలించడానికి అవకాశం ఏర్పడుతుంది.కావున గ్రామ మేధావులు, ప్రతి కుటుంబంలో చదువుకున్న విద్యార్థులు ఈ చట్టం పట్ల తమ తల్లిదండ్రులకు అవగాహనా కల్పించి, మార్గదర్శకానిస్తూ, తమ కుటుంబంలో ఏ విషయం పట్లనైనా సమస్య ఉంటే దానికి తగిన సమాచారాన్ని సేకరించి, చదివి, అర్ధం చేసుకోని, తమ తల్లిదండ్రులతో చర్చించి, ఆ తర్వాత చేయాల్సిన పనులకు పూనుకుంటే ఫలితముంటుంది.

అలాగే సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలపై అధికారులపై ఎలాంటి అనుమానాలున్నా వెంటనే ఈ చట్టాన్ని ఉపయోగించి, సంబంధిత సమాచారాన్ని సేకరించి, అవగాహనా చేసుకోని ఏమైనా తప్పులు కనిపిస్తే వెంటనే, పై అధికారులకు పిర్యాదులు చేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా కృషిచేసినప్పుడే అనుకున్న అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది.అలాగే ఏ అధికారైనా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా , నిస్వార్థంగా తమ విధులు నిర్వర్తించడానికి దోహదబడుతుంది కానీ , ప్రతి ఒక్కరు ఆ దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా , ధైర్యంతో ముందడుగు వేస్తే , మరింత అవగాహనా కలిగి , అధికారులతో పని చేయించుకునే స్థితిలోకి రావడం జరుగుతుంది.

సమాజంలో మీయొక్క పేరు ప్రఖ్యాతలు మారుమ్రోగుతాయి, అవినీతి నిర్ములనకు కృషి చేసినవారవుతారు కావున ప్రతి ఒక్కరు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాలు ఏ చట్టాలను తీసుకొచ్చిన, అవి పేద ప్రజల అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు పాటుపడేవిదంగా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు వాటిపై అవగాహనా చేసుకోని, అనుకూలంగా మార్చుకున్నప్పుడే ఆశించిన ప్రగతిని, అభివృద్ధిని పొందవచ్చు, కానీ నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటూ, పట్టించుకోకుండా ఉంటే నీకెలాంటి లాభం చేకూరదు కావున ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమం పైన దృష్టి కేంద్రీకరించి, సవ్యంగా జరిగే విదంగా పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నది, అలా అందరూ అనుకున్నప్పుడే ప్రతి పని, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా జరిగి, సమాజాభివృద్ధికి దోహదబడుతుంది.

కావున ప్రతి అంశం పట్ల సామాన్య జనానీకాన్నీ చైతన్యవంతులుగా మార్చే విదంగా చర్యలు తీసుకోవడానికి విద్యావంతులు, సమాజ శ్రేయస్సును కోరేవారు, స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు ఒక అడుగు ముందుకేసి అందరిని చైతన్యవంతులుగా మార్చడానికి కృషిచేయాలని ఆశిద్దాం.

-డా.పోలం సైదులు.