సంస్కార్ ఫౌండేషన్ నిర్వాహకురాలు తిరునగరి జ్యోత్స్న ఇటీవల కొత్తగా ప్రారంభమైన తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాచిగూడ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో ఓ అజ్ఞాత వ్యక్తి దుర్గా డాన్ పేరుతో అసభ్యకరమైన కామెంట్లు పోస్టు చేస్తున్నాడని, ఇటీవల తన ఫోన్ నెంబర్‌కు వీడియోకాల్స్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆధారాలతో సహా సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. జ్యోత్స్న మాట్లాడుతూ… మహిళా సాధికారత రావాలని తాను బలంగా కోరుకుంటున్నానని, ఈ క్రమంలోనే తాను ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటుచేసిన తెలంగాణ జనసమితి పార్టీలో చేరానని చెప్పారు. రాజకీయ, సామాజిక పరిస్థితులు, మహిళల సమస్యలు తదితర అంశాలపై తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టింగ్‌లు పెడుతుంటానని, ఎంతోమంది వాటికి స్పందిస్తుంటారని అన్నారు.
ఇటీవల ఓ వ్యక్తి దుర్గా డాన్ పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను నిర్వహిస్తూ తన ఖాతాలో ఉద్దేశ్యపూర్వకంగా అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు పోస్టు చేస్తున్నాడని చెప్పారు. తనను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్న దుర్గా డాన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే కొన్ని ఫొటోలు లభ్యమయ్యాయని, వాటితోపాటు, అతడి స్నేహితులకు చెందిన ఫేస్‌బుక్ ఖాతాల ప్రొఫైల్ వివరాలను, వీడియో కాల్స్, ఫోన్‌కాల్స్ వచ్చిన నెంబర్లను, అతడి ఫేస్‌బుక్ ఖాతాలో అనేకమంది రాజకీయనాయకుల వివరాలు ఉన్నాయని వీటన్నింటిని సైబర్‌క్రైం పోలీసులకు అందజేశానని ఆమె చెప్పారు.