‘కాళేశ్వరం’ అనవసర ప్రాజెక్టు – కోదండరామ్

561
no use with kaleshwaram project

రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అవసరమే లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రం అప్పులపాలవుతోందని, అభివృద్ధి పేరుతో అప్పులు చేసి దోచుకుంటున్నారని కోదండరామ్ విమర్శించారు. సంపన్న తెలంగాణలో అప్పులు చేయాల్సిన అవసరం ఏముందని, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అవసరమే లేదని, ఊకదంపుడు ప్రకటనలతో టీఆర్‌ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.



 

కాళేశ్వరం ప్రాజెక్ట్ దుబారా ఖర్చు అని దివంగత సీనియర్ ఇంజినీర్ హన్మంతరావు గతంలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాళేశ్వరం బదులు ఇచ్చంపల్లి, కణతాలపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులు నిర్మిస్తే ఎంతో ఉపయోగం ఉండేదన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ కుళాయి అని చెబుతున్నారని, ప్రస్తుతం ప్రతీ ఇంట్లో నల్లా లేదా అని ప్రశ్నించారు. మిషన్ భగరీథ పూర్తయ్యాక బొట్టుబొట్టుకూ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారని చెప్పారు. కాగ్ నివేదికతో ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలయ్యాయని ఎద్దేవా చేశారు. తమకు ఇష్టమున్న రంగాలకే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

వివిధ సామాజిక రంగాలకు బడ్జెట్ కేటాయింపులు అధికంగా చూపించి, డబ్బులు ఇవ్వడంలో మాత్రం భారీగా కోత పెడుతున్నారన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అందులో భాగంగానే వర్సిటీలకు నిధులు ప్రతీ సంవత్సరం తగ్గిస్తున్నారని విమర్శించారు. అనంతరం వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల బడ్జెట్‌నే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఆర్థిక క్రమశిక్షణ లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని అన్నారు. బడ్జెట్‌పై చర్చించడానికి సభలో ప్రతిపక్షాలను లేకుండా చేశారని, తమకు అనుకూలంగా ఉన్నవారినే అసెంబ్లీలో ఉంచుకున్నారని విమర్శించారు. కొఠారి కమిషన్ ప్రకారం 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట రెడ్డి, ప్రొఫెసర్ బి. సత్యనారాయణ, ప్రొఫెసర్ పురుషోత్తం, రమేశ్‌రెడ్డి, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.