మార్చి 5న ఏపీ బంద్

234

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుని ప్ర‌జ‌ల వ‌ద్ద మార్క్‌లు కొట్టేయాల‌ని రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మ వంతు కృషి చేస్తున్నాయి.

మ‌రోవైపు అవ‌స‌ర‌మైతే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తామే కొంటామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అంటున్నారు. వీట‌న్నిటి నేప‌థ్యంలో మార్చి 5న రాష్ట్ర బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది.

అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేసి బంద్‌కు స‌హ‌య‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు.

బంద్ విజయవంతంపై విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది.

ఈ బంద్‌కు సీపీఎం మద్దుతు తెలిపింది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.

మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి కోరింది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు.

ఈ బంద్‌ ద్వారా మోడీ ప్రభుత్వానికి తొలి హెచ్చరిక జారీ చేస్తామని సమితి నేతలు అన్నారు.

అంతకుముందు మార్చి 3న పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లతో భారీ సదస్సును విజయవాడలో నిర్వహించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీలందరికీ ఉత్తరాలు రాసి బంద్‌కు సహకరించాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘాలు, విశాఖలోని కార్మిక సంఘాలు ఐక్యం అయ్యాయి. 5వ తేదీ బంద్‌కు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నాం.

హోటళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార సంఘాలు అందరిని సంప్రదిస్తున్నాం. అందరి నుంచి మంచి స్పందన లభించింది. అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదిస్తున్నాం.

అన్ని పార్టీలు బంద్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం.

ఎవ్వ‌రినీ టెండర్స్ వెయ్యనివ్వం. విశాఖలో ఎవరినీ అడుగుపెట్టనివ్వం అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు అన్నారు.