తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం అవుతారన్నారు.
దేవుడి కృప, ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్‌కు మరింత శక్తిని ఇవ్వాలని తాను శ్రీవారిని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.