ప్రమాదాల నివారణకు ముందుకొచ్చిన రూరల్ ఎస్.ఐ.

178
prevent accidents is everyone’s social responsibility
  • ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
  • సామాజిక బాధ్యతతో పని చేస్తున్న పోలీసులు
  • అధ్వాన్నంగా మారిన రోడ్డుపై కంకర డస్ట్ పోయించిన రూరల్ ఎస్.ఐ.
  • రోడ్డు ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకున్న రూరల్ ఎస్.ఐ రాజశేఖర్ రెడ్డి

నల్లగొండ : పోలీసులంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాదు…. రోడ్డు ప్రమాదాల నివారణలోనూ బాధ్యత వహిస్తూ విధి నిర్వహణ చేస్తారని రుజువు చేసి ప్రజలు, వాహనదారులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంటున్నారు నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

నల్లగొండ మండల పరిధిలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి సామాజిక బాధ్యతగా రోడ్లపై ఏర్పడిన గుంతలను చొరవ తీసుకొని కంకర డస్ట్ తో పూడ్చి వేయించి అందరి అభిమానం పొందడంతో పాటు ప్రజలలో పోలీస్ శాఖ పట్ల గౌరవం పెంచేలా చేశారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా నల్లగొండ మండల పరిధిలోని మునుగోడు రోడ్డు రంగారెడ్డి నగర్ శివారులో వెళ్తున్న క్రమంలో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి అధ్వాన్నంగా ఉండడాన్ని గమనించి వెంటనే రోడ్డు కాంట్రాక్టర్, సూపర్ వైజర్లను పిలిపించి కంకర డస్ట్ తెప్పించారు. స్థానిక సర్పంచ్ మామిళ్ల సైదులు సహకారంతో జేసిబి తెప్పించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను దగ్గరుండి పూడ్చి, వాటర్ ట్యాంకర్ తెప్పించి కంకర డస్ట్ పై నీళ్లు పోయించారు ఎస్.ఐ. రాజశేఖర్.

Rural SI Rajashekar Reddy

ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిన రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో పాటు రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడం సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న వాహనదారులనే కాదు ప్రజలను ఆకట్టుకుంది. రోడ్లపై వెళ్తున్న పలువురు ప్రయాణికులు, ప్రజలు ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి చొరవను అభినందించారు.

రోడ్డుపై గుంతలు పూడ్చడానికి చొరవ తీసుకొని కంకర డస్ట్ పోయించడం పట్ల డిఐజి ఏ.వి. రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ట్రైనీ ఎస్.ఐ. మహేష్, సిబ్బంది రమేష్, ప్రవీణ్, సలీమ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు