గల్ఫ్ బాధితుల కష్టాలు తీరేదెప్పుడు?

289
When the hardships of the Gulf victims are over

మనదేశంలో పలురాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్మికులు పొట్టకూటికై, అప్పులు తీర్చుటకు భార్యపిల్లలను ఇంటిదగ్గరే వదిలి, రవాణా ఖర్చులనిమిత్తం ఉన్నఆస్తులను అమ్ముకొని లేదా వడ్డీలకు అప్పులుతీసుకుని వెళ్ళడానికి నిశ్చయించుకొని బ్రోకర్ ఏజెన్సీ సంస్థలను నమ్ముకుని, గల్ఫ్ దేశాలు దుబాయ్, కువైట్, యూఏఈ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఇతర దేశాలకు పయనమయ్యి ఆతర్వాత వారుపడే కష్టాలను వర్ణించాలంటే “రాస్తే రామాయణమంతా – చెబితే మహాభారతమంతా” ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

ప్రపంచంలో దేశాల మధ్య పరస్పర అంగీకారంతో, కొన్ని నియమనిబంధనలతో సంస్థలను ఏర్పాటు చేసుకొని ఆయాదేశాలకు వలసలు వెళ్లేవారికి అండగానిలవడం జరుగుతుంది. అలాగే దేశంలోని రాష్ట్రాలుసైతం ఇతరదేశాలలో ఉండే తమపౌరులకు ఆసరాగా ఉండటానికి రాష్ట్రప్రభుత్వాలే నేరుగా ఆయాదేశాలతో సంబంధాలనుకలిగి, తమరాష్ట్రం నుండి ఇతరదేశాలకు వలసవెళ్లిన వారి క్షేమ, సంక్షేమం,అభివృద్ధికై అసెంబ్లీలలో పలుచట్టాలకు అంకురార్పణచేసి, అమలులోభాగంగా పలుసంస్థలుగా ఏర్పడి సహాయకచర్యలు చేయడంజరుగుతుంది.

ఇక్కడ సమస్యలనేవి పలురకాలుగా ఉంటాయి.మొదటిది భాష. మనదేశంనుండి పరాయిదేశానికి వలసలుగా వెళ్లేవారికి ఆంగ్లం, హిందీ భాషలపై పట్టుఉంటే మొదటిసమస్య తీరినట్టే. కానీ చదువుకున్నవారు వివిధ ఉద్యోగాలు చేయడానికి అక్కడికి వెళితే వారికి ఈసమస్య ఉండదు. కానీ ఎక్కువగా కార్మికులే ఉంటారు కావున కొన్నిరాష్ట్రాల వారికి ఆయా భాషలపై పట్టు ఉండదు. అందువల్ల ఈసమస్య వల్ల ఇంకామరెన్నో సమస్యలబారిన పడాల్సివస్తుంది.

దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు ఇలాంటి కార్మికుల సమస్యలను తీర్చడానికి అధికారికంగా సహాయక చర్యలు చేపట్టడానికి పలురకాల సంస్థలనిర్మించి, అమలుకు నోచుకుంటున్నాయి. కానీ మనతెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి గల్ఫ్ బాధితులకు అలాంటి సహాయకచర్యలు అనుకున్నంత,జరగాల్సిన మోతాదులో జరగక తీవ్ర ఇక్కట్లపాలు కావలసివచ్చి,కుటుంబసభ్యులతో సహా ఆర్థికంగా, మానసికంగా ఎన్నోబాధలు పడుతున్నారనడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

తెలంగాణరాష్ట్రంలో దాదాపు 15 లక్షలమంది ఇతరదేశాలకు వలసలువెళ్లారు. పైచదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయడానికి, పైచదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లినవారికంటే బ్రతుకుదెరువుకై వెళ్ళినవారు అష్టకష్టాలు పడాల్సివస్తుంది. సమస్యలనేవి అందరికీ సహజం అయినప్పటికీ పలురూపాలలో సంభవించి, అవసరమైన సమయంలో సరైన చేయూతలేక వారితోపాటు వారి కుటుంబసభ్యులు ఎంతో మనోవేదనకు గురికావలసి వస్తుంది.వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే….

మనరాష్ట్రంలో ఉమ్మడి అదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్,వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకుచెందిన పేదకార్మికులు, కుటుంబపోషణకో, అప్పులుతీర్చుటకో, ఆర్థిక వెసులుబాటుకో గల్ఫ్ దేశాలకు వలసవెళ్లి, భవననిర్మాణంలో లేదా పలురకాల కంపెనీలలో ఎలాంటి పనులు చేయడానికైనా పూనుకొని వెళ్లడానికి నిశ్చయించుకొని, అప్పులుచేసి ఏజెన్సీ సంస్థల ద్వారా వెళ్లడం జరుగుతుంది. కానీ కమిషన్ అనే కక్కుర్తితో పలుఏజెన్సీ సంస్థలు ఆయాకార్మికులకు ‘చెప్పేది ఒకటి చేసేది ఒకటిగాా’ మోసపూరిత పనులకు పూనుకొని వారి పాస్ పోర్టులను లాక్కొని తీవ్రఇబ్బందులకు గురిచేయడం ఒకసమస్య అయితే అక్కడి భాషలపై పట్టులేక మరిన్ని సమస్యల బారినపడటం జరుగుతుంది.

అలాగే వెళ్లేటప్పుడు వివిధ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకొని దశాబ్దాలపాటు వారి చట్టాలకనుగుణంగా అక్కడి జైలులో శిక్షలు అనుభవించే గడ్డుపరిస్థితులు దాపురించి,కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారాలు అందక ఆర్థిక,మానసికపరమైన సమస్యలవలయంలో చిక్కుకున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుత ప్రసార సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరగడంతో సమాచారం తెలుస్తుంది.కానీ సమస్యల పరిష్కారమార్గాలు లేకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పకతప్పదు.

గతంలో మరణాలు అంటే ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదా పనిచేసే క్రమంలో వివిధ ప్రమాదాల బారినపడటం జరిగేది. కానీ ప్రస్తుతకాలంలో వాటితోపాటు పలురకాల రోగాల బారినపడటం, ఎప్పుడు ఏం జరిగి, ప్రాణం ఎలా పోతుందో తెలియని పరిస్థితి. మానవ జీవితమే’ నీటి బుడగల’ తయారయింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటి ఆకస్మిక మరణాలు సంభవిస్తే ఆ పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అందజేయడానికి ఎంతో ప్రక్రియజరిగి, కాలం వెచ్చిస్తేగాని తీరనిపరిస్థితి. ఇదిలా ఉంటే కుటుంబమంతా అతనిపై ఆధారపడి జీవించేవారికి ఒక్కసారిగా రోడ్డున పడేసినంతపని అయిపోతుందనడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

ఇక్కడ ప్రభుత్వాలు సైతం పక్షపాతధోరణి అవలంభిస్తున్నాయా? అని అనుమానానికి దారితీస్తాయి. అభివృద్ధిచెందిన దేశాలకు ఉన్నతఉద్యోగాలు చేయడానికి వెళ్ళినవారు ఇలాంటి ప్రమాదాల బారినపడితే వారి శవాలని ప్రభుత్వాలు అన్నిరకాల సహాయకసౌకర్యాలు కల్పించి, ఆగమేఘాలమీద వారి కుటుంబీకులకు అప్పగించడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి పరిణామమేకావచ్చు. గాని అదే గల్ఫ్ కార్మికుల విషయంలో ఎందుకు జరగడంలేదనే బాధ ప్రతి ఒక్కరికీ కలుగుతుందనడం నిజమని చెప్పక తప్పనిపరిస్థితి.

సగటున రెండు రోజులకు ఒకశవం గల్ఫ్ దేశాల నుండి రాష్ట్రానికి చేరుకుంటుంది.గుండెపోటు, ప్రమాదవశాత్తు చనిపోతే రావడానికి నాలుగైదురోజులు పడితే, ఆత్మహత్యకు పాల్పడి మరణిస్తే అక్కడి తతంగమంతా పూర్తిచేసుకొని ఇక్కడికి తేవాలంటే వారంరోజులు పట్టేపరిస్థితి. తీర విమానాశ్రయానికి చేరుకున్నాక అంబులెన్స్ సౌకర్యంకూడా అంతంత మాత్రంగానే ఉండడం, కనీసం ఆకుటుంబాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం సాహసించన్నప్పుడు వారికిఆర్థిక సహాయాన్ని ఆశించడం మనతప్పిదమే అవుతుంది.ఎందుకీ వ్యత్యాసాలు,పక్షపాత ధోరణి చూపిస్తున్నారు? ఇంకెన్నడు పేదలను పట్టించుకునే ప్రభుత్వాలు,అమలుకునోచుకునే చట్టాలు వస్తాయో తెలియనిపరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఓట్ల రాజకీయాలు చేస్తున్నారనుకుంటే ‘నాన్ ఇండియన్ రెసిడెన్సి’ కి చెందిన గల్ఫ్ కార్మికులకు చెందినఓట్లు దాదాపు 50వేలకుపైగా ఉన్నాయి. అయినా మనదేశానికి చెందిన పౌరులుకావడం, వారు సంపాదించిన డబ్బులు సైతం ఇక్కడే ఖర్చు పెట్టడం,ప్రభుత్వానికి చేరాల్సిన పన్నులు చేరడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి.అలాంటప్పుడు వారికి అండగానిలుస్తూ,క్షేమం,సంక్షేమ,అభివృద్ధికి పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది.

ముందుగా గల్ఫ్ కార్మికులపైన స్పష్టమైన అధ్యయనం కొనసాగాలి.ఏజెన్సీలు ఎందుకు మోసాలు చేస్తున్నారు? అక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎందుకు జరుగుతున్నాయి? ప్రమాదాలు, ఆత్మహత్యలబారిన పడడానికిగల కారణాలేంటి? లాంటి పలువిషయాలను తెలుసుకోవాల్సిన అవసరంఉన్నది. అలాగే రాష్ట్రప్రభుత్వం సైతం అసెంబ్లీలో వారికంటూ ఒకప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అమలుకు నోచుకునేవిధంగా కృషిచేయాలి. ముందుగా “నాన్ ఇండియన్ రెసిడెన్సీ పాలసీ” తీసుకువచ్చి ప్రభుత్వ పరంగా ఒకయంత్రాంగాన్ని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వారిసమస్యల పరిష్కారం మార్గాలను చూపించడానికి అక్కడ కార్యాలయాలను ఏర్పాటుచేయాలి.

ఏదైనా ఒక టోల్ ఫ్రీ నంబర్ కేటాయించి తక్షణమే వారిసమస్యలను మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ఎవరైనా ఆకస్మిక మరణాలకు గురైతే వారికి పూర్తిగా ఉచితంగానే, ప్రభుత్వ ఖర్చులతో వెంటనే వారికుటుంబీకులకు అప్పగించి,వాటికితగిన ఖర్చులన్నింటిని ప్రభుత్వమే భరించాలి.అలాగే ముందుగానే జీవితబీమా లాంటి సౌకర్యాలను కల్పించి ఆర్థికంగా భరోసాకల్పిస్తూ, పింఛన్ వ్యవస్థను కల్పించి వారికుటుంబాలు బజారున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలపైననే ఉన్నది.

వీలైనంతవరకు కార్మికవర్గం అంతర్జాతీయ వలసలకు వెళ్లకుండా నిరోధిస్తూ,వారికి పనులుకల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది. ప్రభుత్వాలు ఏర్పడేది ముఖ్యంగా ప్రజలకోసమే కావున,అలాంటి ప్రజలు ఇక్కట్లపాలు కాకుండా చూసుకోవాలి.సమాజశ్రేయస్సు కాంక్షించే మేధావివర్గం,స్వచ్ఛందసంస్థలు,నిపుణులు, పరిశోధకులు గల్ఫ్ బాధితులగురించి పూర్తిగా విశ్లేషణగావించి ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి వారికి న్యాయంచేకూర్చడానికి ఒత్తిడి తేవాల్సిన అవసరంఉన్నది. ఎలాగైనా అతిత్వరలో సమసమాజ స్థాపన జరగాలని ఆశిద్దాం.