ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇంతవరకూ జరగలేదన్నారు. రైతులను దోచుకునే సంస్కృతి ఇంకా కొనసాగుతుందన్నారు. రైతు బంధుకు సంబంధించిన పత్రికా ప్రకటనలను ఆస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో వేయించడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. వాటివల్ల కోట్ల రూపాయిల ఖర్చే తప్ప ఏమీ లాభం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ కుటుంబానికే లాభం చేకూరిందన్నారు.
రాజకీయాలు సేవా దృక్పథంతో నడవాలే కానీ దోచుకోవడానికి కాదన్నారు. నిస్వార్దంగా పనిచేసినప్పుడే అభివృద్ది సాధ్యమన్నారు. కాంగ్రెస్ మాజీ నాయకులు దానం నాగేందర్ టీఆర్‌ఎస్ పార్టీలోకి రాగానే ఆపార్టీ బలపడిందని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ జనసమతిని బతికించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నారు. శ్రీకాంతాచారి త్యాగాలను నల్లగొండ జిల్లా ఎప్పటికి మరిచిపోలేదన్నారు. ఆదివారం రాష్ట్రంలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రకరకాలుగా ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించడం సరికాదన్నారు. టీజేఎస్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. జిల్లా ప్రజల సమస్యలు ఉంటే తమపార్టీ దృష్టికి తీసుకరావాలన్నారు. అంతకు ముందు పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా నాయకులు పన్నాల గోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహ్మారెడ్డి, శంకర్, వీరా నాయక్ తదితరులు పాల్గొన్నారు.