ఓటుకు నోటు కేసు ఈడీ విచారణ వేగవంతం

372
inquired into the case

ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకొచ్చిన రూ.50 లక్షలతోపాటు, ఇవ్వజూపిన రూ.4.5 కోట్లకు సంబంధించి మూలాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డితోపాటు, ఆయన కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. ఈ నెల 19వ తేదీలోగా ఈడీ ఎదుట హాజరుకావాలంటూ కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేశారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు.

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకొచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివి? వాటికి సంబంధించి లెక్కలు ఉన్నాయా? ఈ డబ్బు ఎవరి నుంచి తెచ్చారు? ఆయనకు ఇస్తామని చెప్పిన రూ.4.5 కోట్లకు సంబంధించి ఆర్థికమూలాలు ఏమిటి? రేవంత్‌రెడ్డితో ఆర్థికలావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని ఈడీ అధికారుల బృందం ఇరువురిని ప్రశ్నించింది. ముందస్తుగానే సేకరించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఏసీబీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని దగ్గర పెట్టుకున్న ఈడీ అధికారులు.. వాటికి సంబంధించి ఇరువురి నుంచి వేర్వేరుగా సమాధానాలు రాబట్టింది. దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన విచారణలో అనేకకోణాల్లో వారినుంచి వివరాలు సేకరించింది. వేం నరేందర్‌రెడ్డి ఇద్దరు కుమారులను సోమవారం విచారించిన ఈడీ అధికారులు.. మంగళవారం ఆయనతోపాటు, పెద్దకుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డిని విచారించింది.

ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా: వేం నరేందర్‌రెడ్డి

ఓటుకు నోటు కేసులో తనతోపాటు ఇద్దరు కుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని కాంగ్రెస్‌నేత వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చా. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహకు కూడా నోటీసులిచ్చారు. నాతోపాటు నా ఇద్దరు కుమారులను విచారించడం చాలా బాధగా అనిపించింది. వారిని కేసులో ఇరికించడం సరికాదు. నాపై వచ్చిన ఆరోపణలపై నిజాలన్నీ కోర్టు విచారణలో తేలుతా యి. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతాఅని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డికి ఈడీ నోటీసులు!

ఓటుకునోటు కేసులో నిందితుడు, కాంగ్రెస్‌పార్టీ నేత రేవంత్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీచేసినట్టు సమాచారం. ఈ నెల 19లోపు (వారం రోజుల లోపు) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డిని గెలిపిచేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపారన్న అరోపణలపై ఏసీబీ అధికారులు దాఖలుచేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ వేగవంతంచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌రెడ్డితోపాటు మరో నిందితుడు ఉదయసింహకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.