సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ఉద్యమంపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు.
జాతీయ వ్యవసాయ చట్టాల అంశంలో కేంద్రం, రైతుల మధ్య చర్చల సరళిపై రైతుల సంఘాల నేతల వైఖరిపై ఆమె విమర్శలు గుప్పించారు. రిపబ్లిక్ డే సంఘటనల వరకు కూడా కేంద్రం రైతులతో చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందన్నారు. ఇరుపక్షాలు అప్పటిదాకా ఎంతో సంయమనంతో వ్యవహరించాయని తెలిపారు.
కానీ రైతు సంఘాల నేతలు మాత్రం రాజకీయ శత్రువుల తీరులో మాట్లాడడం బాధాకరమని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇవి నిజంగానే రైతు సంఘాల మాటలా లేక ఎవరైనా వారి వెనకుండి ప్రేరేపిస్తున్నారా అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.జనవరి 26న జరిగిన సంఘటనల నేపథ్యంలో రైతు సంఘాలు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల సమస్య మరింత క్షిష్టం అవుతుందన్నారు.
సాగు చట్టాల అంశంపై అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు కూడా స్పందిస్తున్నారని చెప్పారు. వారు ఈ విషయంపై ఇంత శ్రద్ధగా పోస్టులు పెట్టేందుకు తెగబడడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.