తెలంగాణలో హైకోర్టు న్యాయవాదులైన వామనరావు-నాగమణి దంపతుల దారుణ హత్యలు సంచలనం రేకెత్తించింది.
ఈ హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న వారికి టీఆర్ఎస్ తో సంబంధాలు ఉండటంతో విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వామనరావు దంపతులను హత్య చేశారని అన్నారు.
నడిరోడ్డు మీద ప్రాణాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని నిలదీశారు.
నయీమ్ కేసును నీరుగార్చినట్టే ఈ కేసును కూడా చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ వల్ల తెలంగాణలో కూడా రాయలసీమ తరహా ఫ్యాక్షన్ సంస్కృతి వస్తోందని వీహెచ్ విమర్శించారు.
కేసీఆర్ పుట్టినరోజున కేకులతో పాటు మనుషులను కూడా కోశారని వీహెచ్ దుయ్యబట్టారు.