సైబర్ క్రైంకి V6 న్యూస్ కంప్లయింట్

544
V6 complaint with cyber crime police

యూట్యూబ్ లో వీ6 వార్తల వీడియోలపై తప్పుదోవ పట్టించేలా బొమ్మలు కనిపంచడంపై వీ6 ప్రతినిధులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం (మార్చి-28) సాయంత్రం నుంచి అప్ లోడ్ అవుతున్న వీడియోలపై సంబంధం లేని చిత్రాలు వస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో పాటు యూట్యూబ్ నిర్వాహకుల ద్రుష్టికి తీసుకెళ్లారు.


యూటూబ్, ఫేస్ బుక్, వెబ్ సైట్ తో సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యే వేదికగా ఉన్న వీ6 వీడియోలను రోజూ 25 లక్షల మందికిపైగా చూస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి అప్ లోడ్ అవుతున్న వీడియోల థంబ్ నెయిల్స్ పై వాటితో సంబంధంలేని బొమ్మలు తప్పుదోవ పట్టించేలా కనిపించాయి. దీన్ని వెంటనే గుర్తించిన వీ6 ప్రతినిధులు యూట్యూబ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే వీడియోలను అందించకూడదన్న వీ6 విధానంలో భాగంగా కొన్ని గంటల పాటు న్యూస్ వీడియోల అప్ లోడింగ్ ను నిలిపేశారు.

ఈ సంఘటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకుల్లో వీ6కు ఉన్న ఆదరణ చూసి, దాన్ని దెబ్బ తీయడానికి జరిగిన ప్రయత్నంగా అనుమానాలొస్తున్నాయి. వీ6 న్యూస్ వీడియోల లింకులపై అశ్లీల బొమ్మలు కనిపించేలా చేయడం ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై వీ6 ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఐదు సంవత్సరాలుగా వీ6 యూట్యూబ్ చానెల్ ఎప్పటికప్పుడు న్యూస్ వీడియోలతో వేగంగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. గాసిప్, అశ్లీల కంటెంట్ లేకుండా సమాచారం, అవగాహన కలిగించే వీడియోలను అందిస్తుండడంతో వీ6 యూట్యూబ్ చానెల్ సభ్యులు వేగంగా పెరుగుతున్నారు. 17 లక్షల మంది సభ్యులతో యూట్యూబ్ లో ఎక్కువమంది సబ్ స్క్రైబర్లు ఉన్న తెలుగు న్యూస్ ప్లాట్ ఫాంగా వీ6 మొదటి స్థానంలో నిలిచింది. వార్తల సెగ్మంట్ లో దేశంలోనే టాప్ యూబ్యూబ్ చానెళ్లలో ఒకటిగా ఉంది.