యూఎస్‌లో బంపర్ ఆఫర్..’సైరా’ టికెట్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ

263
bumper offer

‘సైరా’ మూవీ యూఎస్ఎలో కూడా భారీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిజినెస్ జరిగిపోయినట్లు సమాచారం. భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది.. అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 1న మంగళవారం కావడం.. అమెరికాలో సైరా సినిమాకు కాస్త అడ్వాంటేజ్‌గా మారనుంది.

అమెరికాలో ప్రతి మంగళవారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, యాప్స్‌ పలు ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంటాయి. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేలా మన టాలీవుడ్ నిర్మాతలు.. సినిమాలను విడుదల చేస్తుంటారు. మంగళవారం అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఈ ఆఫర్లు ఎంత మేలు చేస్తాయో ఇట్టే తెలిసిపోతుంది.

ఖైదీ నెంబర్ 150, అజ్ఞాతవాసి, స్పైడర్, గీత గోవిందం.. వంటి సినిమాలన్నీ మంగళవారం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా విడుదలయ్యాయి. వీటిలో పవన్, మహేశ్ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్ కలెక్షన్లలో దుమ్మురేపాయి. అజ్ఞాతవాసి సినిమా అయితే ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. స్పైడర్ కూడా మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాకు 2.45 మిలియన్ డాలర్ల కలెక్షన్లను చేరుకోగా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. అందుకే పెద్ద సినిమాలను సరిగ్గా మంగళవారం విడుదలయ్యేట్లు నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు.

ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా అమెరికాలో మంగళవారమే విడుదలవబోతోంది. అమెరికాలో ప్రస్తుతం ఏటీ&టీ సంస్థ ఒక టికెట్ కొంటే.. మరో టికెట్ ఫ్రీ అనే ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సంస్థ నుంచే కాకుండా.. పలు సోషల్ మీడియా యాప్స్ కూడా ఇలాంటి ఆఫర్లను అందుబాటులో ఉంచాయి. మరి ఈ ఆఫర్లతో సైరా చిత్రం కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో.. వేచిచూడాలి.