కానిస్టేబులా ?… నాకొద్దు అంటున్న అమ్మాయిలు

789
girl rejected constable

‘సర్‌.. చార్మినార్‌ పోలీస్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాను. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పదిహేను రోజుల కిందట పెళ్లిచూపులకు వెళ్లాం. నేను కానిస్టేబుల్‌ అని చెప్పగానే.. ఆ అమ్మాయి కానిస్టేబుల్‌ అంటే 24 గంటలూ పని ఉంటుందిగా.. నాకీ సంబంధం వద్దు అంటూ తిరస్కరించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’నని పోలీస్‌ కానిస్టేబుల్‌ సిద్ధాంతి ప్రతాప్‌ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు లేఖ రాశారు.

ఈ నెల 7న ప్రతాప్‌ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులంటే పెళ్లి కాని అమ్మాయిలు ఇష్టపడడం లేదంటూ వేల సంఖ్యలో వ్యాఖ్యలొచ్చాయి. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తాను పోలీస్‌ శాఖపై ఉన్న మక్కువతో నాలుగేళ్ల కిందట కానిస్టేబుల్‌గా చేరానని తెలిపారు.

police job

 

పోలీస్‌ కానిస్టేబుల్‌గా చేరిన వారికి సర్వీస్‌ ప్రకారం పదోన్నతులు లభించడం లేదని ప్రతాప్‌ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. 20 ఏళ్లు పనిచేసినా కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉండాల్సి వస్తోందని, ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్వీస్‌ ప్రకారం పదోన్నతులు లభిస్తున్నాయని లేఖలో పేర్కొన్నాడు.

ఇవన్నీ పరిశీలించాక తీవ్ర నిరాశతో రాజీనామా చేస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రతాప్‌ను సంప్రదించగా.. లేఖ రాసిన మాట వాస్తవమేనని, ఇది పోలీస్‌ అంతర్గత విషయమని అన్నారు. కానిస్టేబుల్‌ అనే కారణంతోనే సదరు యువతి పెళ్లికి తిరస్కరించిందని ధ్రువీకరించాడు.