మూడు సార్లు తలాక్ చెబితే ఇక నేరం

379
triple-talaq-to-be-an-offence

ముస్లిం మహిళల కోసం తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు చట్టంగా మారకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ముమ్మారు తలాక్‌ను నేరంగా పేర్కొంటూ తయారుచేసిన ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.

మూడు సార్లు తలాక్ చెబితే ఇక నేరం. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి ఇవాళ కొత్త ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇటీవల పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుమతి దక్కని విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌పై తీసుకు వస్తున్న కొత్త ఆర్డినెన్స్.. ముస్లిం మహిళల వివాహ చట్టానికి తగ్గట్లుగా ఉంటుంది. వివాదాస్పద బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
 

ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణించేలా తీసుకొచ్చిన ముస్లిం మహిళల బిల్లు 2017 డిసెంబరు 28న లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో భాజపాకు సంఖ్యాబలం లేనందున ఆమోదం పొందలేకపోయింది. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సమయంలో రాజ్యసభలో చర్చకు తీసుకురావాలని భావించినప్పటికీ అప్పుడు కూడా కుదరలేదు. మరోవైపు ఈ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్‌ మినహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ అంశంపై అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను కూడా కేంద్రం సేకరించింది. ఈ బిల్లుకు దాదాపు అన్ని రాష్ర్టాలు ఓకే చెప్పేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాలను సంతృప్తి పరిచేలా ఈ బిల్లులో మూడు కీలక సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు సార్లు తలాక్ అని చెబితే, ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చినట్లే. అయితే ఆ సంస్కృతికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.