చినిగిన కొత్త నోట్లు చెల్లవు

467
Torn notes cannot be exchanged

చినిగిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకులు తీసుకోవు. రిజర్వు బ్యాంకుకు వెళ్లినా లాభం లేదు.పాత పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి 16 నెలలవుతున్నా చినిగినా…దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు రాలేదు. ఆ కారణంగా చినిగిన నోట్లను తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువ చేసే కొత్త నోట్ల మార్పిడి కోసం వస్తున్నవారిని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాల్సిందిగా సూచిస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు, ATMలలో చినిగిన కొత్త నోట్లు వస్తున్నాయి.



 

కొత్త నోట్ల మార్పిడి కోసం హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినా నిరాశే ఎదురవుతోంది. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి కొత్త నోట్ల మార్పిడికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని.. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే చిరిగిన నోట్లను మార్పిడి చేస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు చినిగిన నోట్లను దాచిపెట్టుకోవాలని సూచిస్తూ తిప్పిపంపుతున్నారు. అయితే తాము ఆదేశాలు ఇచ్చేవరకు కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు తెలిపాయి.


 

పాత పెద్ద నోట్లు రద్దయి కొత్తగా రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువైన నోట్లు చలామణీలోకి వచ్చాక నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలేవీ జారీ కాలేదు. పాత రూ. 500 నోట్లతో పోలిస్తే కొత్త నోట్ల పరిమాణంలో తేడా ఉంది. దీంతో పాత నోట్లకు సంబంధించిన గ్రిడ్‌లను కొత్త నోట్లకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. చిరిగిన కొత్త నోట్ల మార్పిడికి బ్యాంకులు నిరాకరిస్తుండటం.. చినిగిన నోట్ల మార్పిడి చేసే వ్యాపారస్తులకు వరంగా మారింది. భారీగా కమీషన్ల దందాకు తెరలేచింది. రూ.2 వేల చినిగిన నోటు మార్పిడికి రూ.500 వరకు.. రూ.500 నోటు మార్పిడికి రూ.200 వరకు కమీషన్‌గా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అడ్డగోలు కమీషన్‌ కింద నోట్లను మార్పించుకోవాల్సి వస్తోంది.