ఒకప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులైతేనేం.. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించి అక్రమ వ్యాపారాలైతేనేం.. అన్నింటి గుట్టును రట్టు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారుండరేమో. జేడీ అన్న పదమే లక్ష్మీ నారాయణ ఇంటి పేరా అన్నంతగా జేడీ లక్ష్మీనారాయణ అందరి నోళ్లలో నానిపోయారు. అయితే, ఆయనిప్పుడు రాజకీయారంగేట్రానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వీలైతే సొంత పార్టీ లేదంటే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి వెళ్లి ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ కథనాలకు తగినట్టుగానే గురువారం ఆయన తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పొందారు. ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. మహారాష్ట్ర డీజీపీకి తన వీఆర్ఎస్ పత్రాన్ని సమర్పించారు. తన వీఆర్ఎస్‌ను ఆమోదించాల్సిందిగా ఆయన కోరారు.
రాజకీయాల వైపు అడుగులు
పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన ఏం చేస్తారన్నది చెప్పకపోయినప్పటికీ.. రాజకీయాలవైపే ఆయన అడుగులు పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీలైతే ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ అది వీలుకాకపోతే పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీతో పాటు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యాన ఇప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అంటే ఏడాది పాటు జనాల్లో తిరిగి పటిష్ఠ బేస్‌ను ఏర్పాటు చేసుకుంటే రాజకీయాల్లో తన మార్క్‌ను చూపించొచ్చని భావిస్తున్నారని అంటున్నారు.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినట్టు తాను కూడా సొంతంగా పార్టీ పెట్టే ఆలోచననూ చేస్తున్నట్టు సమాచారం. ఇంకో విషయమేంటంటే.. జగన్ కేసును విచారిస్తున్న సందర్భంలో మహారాష్ట్రకు తనను బదిలీ చేయడం కూడా లక్ష్మీనారాయణకు ఇష్టం లేదని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బదిలీపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తి చేసినట్టు చెబుతున్నారు. ఏదేమైనా జగన్ కేసులతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న జేడీ లక్ష్మీనారాయణకు.. ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. మరి, ఆ ఫాలోయింగ్‌తో ఆయన రాజకీయాల్లో నెట్టుకొస్తారా..? అంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. జేడీ లక్ష్మీ నారాయణ లాంటి నిఖార్సైన నిజాయతీ పరుడు వస్తానంటే.. ఎవరు మాత్రం వదులుకుంటారు. కాబట్టి జనసేనలోకి వెళ్తానంటే జేడీ లక్ష్మీనారాయణ రాకను పవన్ కల్యాణ్ కూడా నిస్సందేహంగా ఆహ్వానిస్తాడనే చెప్పుకోవాలి.