రేడియో కూడా లేని రోజుల్లో మానవునికి ఎలా టైంపాస్ అయ్యేదో తెలీదు. అయితే రేడియోలు వచ్చా కాస్త కాలక్షేపం అయ్యేది.
తర్వాత టీవీలు వచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్రారంభమైంది. కానీ స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక యువత అందులోనే తల దూర్చి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు.
చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా గమనించనంతగా మునిగిపోయారు. ఒకప్పుడు టెలివిజన్, స్మార్ట్ ఫోన్ అవసరం.. ప్రస్తుతం అవి నిత్యావసరాలుగా మారాయి.
టెలివిజన్, స్మార్ట్ ఫోన్ లేని ఇల్లంటూ ఇప్పుడు కనిపించదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
కానీ చిన్నతనంలోనే టీవీలకు, స్మార్ట్ ఫోన్‌లకు బానిసలవుతున్నారు. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు…ఫోన్‌ను అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలిస్తే ప్రాణలు తీసుకున్న వారి గురించి టీవీల్లో చూశాం.
న్యూస్ పేపర్లలో చదివాం. పిల్లలు టీవీల్లో అయితే కార్టూన్స్ చూస్తూ, ఫోన్లలో గేమ్స్ ఆడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. యువత కూడా ఇదే దారిలో నడుస్తోంది.
టెక్నాలజీ వల్లే
టెక్నాలజీ వాడకం కొంత వరకు మంచిదే. కానీ అతి వినయోగం ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. యువత విషయంలో ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది.
ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడటం, మొబైల్ గేమ్స్‌కు అతుక్కు పోవడం వల్ల పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలిసింది.
13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు మధ్య వయసు గల 500 మంది యువతీ, యువకులపై ఈ అధ్యయనం జరిగింది. 2009లో ప్రారంభమైన ఈ అధ్యయనం 10 సంవత్సరాల పాటు సాగింది.
టీనేజీ బాలికలు టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, సామాజికంగా మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని పేర్కొంది.
అబ్బాయిల్లోనూ ఇటువంటి ఆలోచనలే కనుగొన్నామని అధ్యయనం పేర్కొంది. ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ వాడకం బాలికలకు ప్రమాదకరమని, రీడింగ్ యాప్స్ అబ్బాయిలకు ప్రమాదకరమని అధ్యయనం స్పష్టం చేసింది.
తల్లిదండ్రులు, కౌమారదశలోని తమ పిల్లలను మొబైల్ వాడకానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచితే ఈ ఆత్మహత్య ఆలోచనలను నివారించవచ్చని అధ్యయనం సూచించింది.
ఈ అధ్యయనంపై బ్రిగ్హామ్ యంగ్ విశ్వవిద్యాలయ పరిధిలోని స్కూల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అసోసియేట్ డైరెక్టర్ శారా కోయెన్ మాట్లాడుతూ ‘సాధారణంగా ఏ స్క్రీన్‌పై అయినా ఎక్కువ సమయం గడపడం అనేది ఆత్మహత్య ఆలోచనలకు దారితీయదు.
కానీ ఈ రెండు సంఘటనలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అయితే టీనేజీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూడటం, మొబైల్ వాడటానికి కేటాయిస్తున్నారు.
తద్వారా వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఫలితంగా వారిలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతున్నాయి.
ఇవి వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరగడానికి కారణమవుతాయి’ అని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో యాక్టివ్ గా ఉండకపోతే వెనుకబడిపోతున్నామనే భావన పిల్లల్లో పెరిగిపోతుంది.
ఎక్కువ సేపు ఆన్ లైన్లో ఉంటేనే అంతా మనల్ని గుర్తిస్తారని పిల్లలు భావిస్తున్నారు. వారు అప్ లోడ్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్స్, కామెంట్లు రాకపోతే ఆత్మనూన్యతా భావానికి లోనవుతున్నారు.
ఇవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు గడపకుండా వారి ఆలోచనలను మళ్లించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.