వేసవిలో తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ

455
Telangana tourism summer package

రాష్ట్రంలో టూరిజం డెవలప్‌మెంట్‌ కోసం పర్యాటక శాఖ వినూత్న పద్దతిలో దూసుకెళుతోంది..! వేసవి సెలవుల నేపథ్యంలో తాజాగా టెంపుల్ టూరిజం అనే ప్రత్యేక ప్యాకేజీని యాత్రికుల కోసం ఏర్పాటు చేసింది..! రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను చుట్టొచ్చేలా టెంపుల్ టూరిజం ప్యాకేజీని రూపొందించింది.

వేసవి సెలవులు రావడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ టెంపుల్ టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. రాష్ట్రంలోని ఆలయాలు, పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు పర్యాటక శాఖ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పది ముఖ్యమైన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు దర్శించుకునేలా టెంపుల్ టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేసింది.

టెంపుల్‌ టూరిజంకు వచ్చే పర్యాటకులు హైదరాబాద్‌ నుండి బయలుదేరి రెండు రోజుల పాటు పది దేవాలయాలను దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి పర్యాటక శాఖ బస్సు బయలుదేరుతుంది. మొదట యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి హన్మకొండ వేయి స్థంబాల గుడి, వరంగల్‌లోని భద్రకాళి దేవాలయానికి తీసుకెళ్తారు. అనంతరం భూపాలపల్లి జిల్లా లక్నవరం పర్యాటక ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడి నుండి రామప్ప ఆలయ దర్శనానంతరం కాళేశ్వరం చేరుకుంటారు.

ఇక మరసటి రోజు ఉదయం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పంప్‌హౌస్ నిర్మాణాన్ని, గోదావరి నదిని యాత్రికులు వీక్షించవచ్చు. అక్కడ నుండి కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయ దర్శనంతో పాటు బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహా స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, వేముల వాడ రాజరాజేశ్వర స్వామి, వర్గల్‌లోని సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో టెంపుల్ టూరిజం ముగుస్తుంది.