కేసీఆర్‌కు ష‌ర్మిల షాక్‌

314

ఏపీలో అన్న… తెలంగాణ‌లో చెల్లెలు.. ఇత‌ర పార్టీ నాయ‌కుల‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో ష‌ర్మిల కొత్త పార్టీ అంశంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న ప‌దునైన ఆలోచ‌న‌ల‌తో రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

త‌మ పార్టీకి తిరుగులేద‌ని ధీమాగా ఉన్నారు. అయితే మొన్న జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీని నిద్ర‌లేప‌గా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు హెచ్చ‌రించాయి.

దుబ్బాక‌లో విజ‌యం, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫ‌లితాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బీజేపీ ఎంతో ఉత్సాహంగా క‌నిపించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య బావుటా ఎగుర‌వేస్తామ‌న్న ధీమాతో ఉండింది.

అయితే ఉన్న‌ట్టుండి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో బీజేపీ కాస్త మ‌రుగున ప‌డింది. ప్ర‌స్తుతం తెలంగాణాలో ష‌ర్మిల రాజ‌కీయ పార్టీ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ పెట్టేలా వ‌చ్చిన వార్త‌ల‌తో హైద‌రాబాద్‌లోని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నివాస‌ముండే లోట‌స్ పాండ్ కోలాహ‌లంగా మారింది. ప‌లువురు నేత‌ల‌తో, ప్ర‌ముఖ వ్య‌క్తుల‌తో వైఎస్ ష‌ర్మిల భేటీ కావ‌డం చూస్తే ఆమె రాజ‌కీయ పార్టీ ఏర్పాటుపై వేగంగా ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న స‌న్నిహితులు, నాయ‌కుల‌తో ఆమె స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో ష‌ర్మిల భేటీ అయ్యారు.

అనంత‌రం రెడ్డి సంఘం అధ్య‌క్షుడు స‌త్య‌నారాయ‌ణ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కేసీఆర్ మోసం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత రెడ్ల‌కు దిక్కులేకుండా పోయింద‌ని.. ష‌ర్మిల పార్టీతో పున‌ర్వైభ‌వం వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.

కేసీఆర్ త‌ప్పుడు హామీలిచ్చి త‌మ వ‌ర్గానికి అన్యాయం చేశార‌ని స‌త్య‌నారాయ‌ణ రెడ్డి విమ‌ర్శించారు. రెడ్డి సామాజిక వ‌ర్గం ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం కేసీఆర్‌కు ఒకింత షాకే అని చెప్పాలి.

తొలుత న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానుల‌తో, నేత‌ల‌తో భేటీ అయిన ష‌ర్మిల ఇత‌ర వ‌ర్గాల నేత‌ల‌తోనూ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల‌తో పాటు మాజీ ఉన్న‌తాధికారులు కూడా వైఎస్ ష‌ర్మిల‌ను క‌లుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌ను స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్నారు. వీరిద్ద‌రు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కీల‌క హోదాల్లో ప‌ని చేసిన‌వారే.

బ్ర‌ద‌ర్ ష‌ఫీ కూడా ష‌ర్మిల‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కూడా షర్మిలను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.