25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కిన ఎస్సై!

211
ACB caught two employees

సీజ్‌ చేసిన ఆటో ట్రాలీని విడుదల చేసేందుకు రూ. 25 వేలు లంచం డిమాండ్‌ చేసిన హైద్రాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్సై బెల్లన భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

పంజాగుట్ట పీఎస్‌ నుంచి ఎస్సై బెల్లన భాస్కర్‌రావు ఏడాదిన్నర క్రితం ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ అయ్యాడు.

గత నెల 12న మహమ్మద్‌ ఖాసీం అనే వ్యక్తి ఓ రేషన్‌ దుకాణం నుంచి ట్రాలీలో క్వింటాల్‌ గోధుమలు తీసుకుని వెళ్తుండగా స్థానికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్సై భాస్కర్‌రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించారు. ఖాసీంను అరెస్టు చేసి, ఆటో ట్రాలీని సీజ్‌ చేశారు.

ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఖాసీం.. తన వాహనాన్ని విడిపించుకునేందుకు పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరిగేవాడు. ఈ క్రమంలో ఎస్సై భాస్కర్‌రావు అతడిని పిలిపించాడు.

రూ. 25 వేలు లంచం ఇస్తే.. పౌర సరఫరాల అధికారుల బెడద లేకుండా నీ ట్రాలీని నీకు అప్పగిస్తానని స్పష్టం చేశారు.

దీంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం రాత్రి ఖాసీం ఎస్సైకి రూ. 25వేలు అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.