ఆకతాయిలు చేసే పనో లేక నిజంగానే ఉగ్రవాదులు బెదిరించారో తెలీదు కానీ తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
దీంతో ఉత్తప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. తాజ్‌మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
అప్పటికే లోపల ఉన్న పర్యాటకులను హుటాహుటిన బయటకు తరలించారు.
లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం (4-3-2021) ఉదయం గుర్తు తెలియని వ్యక్తి యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేశాడు.
తాజ్‌మహల్ లోపల బాంబులు పెట్టామని కాసేపట్లో పేల్చేస్తామని చెప్పారు. ఫోన్ రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే పర్యాటకులను బయటకు తరలించి తాజ్‌మహల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు సీఐఎస్ఎఫ్‌తో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది తాజ్ మహల్ లోపల తనిఖీలు చేపట్టారు.
ప్రతి అంగుళం పరిశీలించారు. ఇప్పటి వరకైతే తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అయినప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
అయితే పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా అధికారులు ఆరాతీస్తున్నారు. యూపీలోని ఫిరోజాబాద్ నుంచి కాల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్ మహల్. భారతీయులతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.
అలాంటి తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు రావడంతో యూపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. పర్యాటకులు సైతం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే ఇది ఆకతాయి పనేనా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుబడితేనే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశముంది.