
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్‌ను దాఖలు చేసిన పిటిషనర్‌ను కోర్టు మందలించింది. ముంపు గ్రామాల్లో సరైన చర్యలు చేపట్టకుండా పనులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో హయత్‌ఉద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. చెన్నై బెంచ్ నుంచి దిల్లీకి ఎందుకు వచ్చారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరం హంటింగ్ చేస్తున్నారా అంటూ మందలించింది. కేసు దాఖలులోనే ఆలస్యం చేశారని పేర్కొంది. ఒక చోట కాకపోతే మరోచోటికి వస్తారా? అని చురకలంటించింది. కేసు విచారణకు అర్హం కాదంటూ, పిటిషనర్ ఆలోచన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
హరీశ్‌రావు హర్షం
సుప్రీం తీర్పుపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేసు వాదనలను ఆయన స్వయంగా పరిశీలించారు. పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటిల యత్నాలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు అన్నారు. చివరికి న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన కుట్రలకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. పిటిషన్ల వెనుక ఎవరున్నది త్వరలో అసెంబ్లీలో బయటపెడతామన్నారు.
ఈ తీర్పు నేపథ్యంలో తాము ఇంకా కష్టపడి పనిచేసి.. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరి కల్లా కాళేశ్వరం నీటిని రైతులకు అందిస్తామన్నారు. నేటి తీర్పుతో తెలంగాణ రైతుల కల సాకారం కానుందని ఆనందం వ్యక్తం చేశారు.