కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ నెల నుంచే స్కూళ్ళు పున:ప్రారంభం కావడంతో యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్ కాకతీయనగర్‌లో ఉండే హరిప్రసాద్ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు.
చిన్న కుమార్తె యశస్విని (16) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
గడిచిన మూడ్రోజులుగా స్కూల్ ఫీజు సుమారు రూ.3 వేలు చెల్లించాలని స్కూల్ యజమాన్యం తండ్రికి ఫోన్‌చేస్తూ ఒత్తిడి తెస్తోంది.
దీంతో మనస్తాపానికి గురైన యశస్విని స్కూల్‌కు వెళ్లలేదు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.