శ్రీలంకలో పది రోజుల ఎమర్జెన్సీ

242
Sri Lanka Declares Emergency For 10 Days

శ్రీలంకలో మత హింస చోటు చేసుకుంది. దీంతో పది రోజుల పాటు ఆ దేశం ఎమర్జెన్సీ విధించింది. కాండీ జిల్లాలో బుద్ధులు, ముస్లింల మధ్య అల్లర్లు జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏడాదిగా ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక ముస్లింలు మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని అక్కడి బౌద్ధ మతస్థులు ఆరోపిస్తున్నారు. అక్కడి బౌద్ధులకు చెందిన ప్రాచీనాలయాలను ధ్వంసం చేస్తున్నట్లు కూడా వాళ్లు తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంకలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న వారి సంఖ్య పెరుగుతుండటంపై కూడా అక్కడి బుద్ధులు ఆందోళన వ్యక్తంచేశారు. హింస నానాటికీ పెరిగిపోతుండటంతో పది రోజుల పాటు ఎమర్జెన్సీ విధించాలని ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రతినిధి దయసిరి జయశేఖర వెల్లడించారు.



ఇతర ప్రాంతాలకు ఈ మత హింస పాకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ హింసను ప్రేరేపిస్తున్న వారిపైనా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంచేశారు. కాండీలోని ఓ ముస్లింకు చెందిన దుకాణానికి మంగళవారం కొందరు నిప్పంటించడంతో గొడవ మొదలైంది. దీంతో ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను అక్కడికి పంపించింది. అక్కడ ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. శ్రీలంకలో మెజార్టీ బౌద్ధ మతస్థులే కాగా.. ముస్లింలు మైనార్టీలుగా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ ట్రై సిరీస్ కోసం శ్రీలంక పర్యటనలో ఉండటంతో వాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తంచేస్తున్నది.