అత్తింటి వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం రాసి అల్లుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం బగలకుంటెలో చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ (32)కు కొద్ది సంవత్సరాల క్రితం సుమ అనే మహిళతో వివాహమైంది. అయితే శ్రీనివాస్ తన అన్న ఇంట్లోనే కాపురం పెట్టడాన్ని సహించలేకపోయిన సుమ ప్రతీరోజూ వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి చేసేది. సుమ ఒత్తిళ్లను శ్రీనివాస్ తేలికగా తీసుకోవడంతో ప్రతీరోజూ మానసికంగా వేధించడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా వస్తే ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిట్టడం ప్రారంభించింది. ఇంటికి వచ్చాక కూడా శ్రీనివాస్‌ను దూషిస్తూ గొడవ పడుతుండేది. అందుకు సుమ తల్లితండ్రులు గంగణ్ణ, శారదలు కూడా సహకరించి శ్రీనివాస్‌ను మాటలతో వేధించేవారు. భార్య, అత్తమామల వేధింపుల గురించి అన్న రవీశ్వర్‌తో చెప్పుకొని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రవీశ్వర్ దంపతులు దేవాలయానికి వెళ్లగా శ్రీనివాస్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన రవీశ్వర్ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెత్‌నోట్‌ను స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.