సర్పంచుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా ?

648
Sarpanch problems
file photo

దేశానికి గ్రామాలు  పట్టుకొమ్మలు లాంటివి. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి గ్రామానికి ప్రథమపౌరుడు సర్పంచ్. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి గ్రామ ప్రథమపౌరుడు ముందువరుసలో ఉంటాడు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో గ్రామీణ అభివృద్ధికి తోడ్పడతాడు.

కానీ తెలంగాణరాష్ట్రంలో  ”పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ” వచ్చాక సర్పంచుల సమస్యల గురించి  “వ్రాస్తేరామాయణమంతా – చెబితే మహాభారతం అంతా” ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

గ్రామాలలో సర్పంచ్ ల పాత్ర కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి.లక్షల కొలది రూపాయలు ఎన్నికలలో ఖర్చుపెట్టి, గెలుపొంది, కొలువుధీరాక రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునుబట్టి అష్టకష్టాలు పడాల్సివస్తోంది.

రాష్ట్రప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికై ఎన్నో నిధులు ఇస్తున్నామని, వైకుంఠధామం, నర్సరీ, హరితహారం, టీగార్డులు, ఇంటింటికి చెత్తబుట్టలు, రైతువేదికలు, విలేజ్ పార్కులు, డంపింగ్ యార్డులు పలురకాలుగా ప్రాజెక్టులు చేపట్టి సర్పంచ్ ల చేత చేయిస్తుంది. లక్షలకొద్దీ రూపాయలు అప్పుగాతెచ్చి ప్రభుత్వం చెప్పిన అన్నిపనులను చేస్తున్నా, గతరెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఒక్కపైసా కూడా రాకపోవడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఇదిగాక చెప్పినపని చేయకపోతే ప్రభుత్వం నుండి షోకాజ్ నోటీసులు ఇచ్చి, సస్పెండ్ కూడా వెనుకాడటంలేదు. దీనికితోడు ప్రభుత్వ అధికారుల నుండి తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటు ఏమిచెయ్యాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారనడంలో నిజంలేకపోలేదు.

కేంద్రప్రభుత్వం ఇచ్చే ఈజీఎస్ ఫండ్స్ ను రాష్ట్రప్రభుత్వం వారు తలపెట్టే కార్యక్రమాలకు తరలించడంతో సర్పంచులు పని “ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ” అయింది.

కనీసం గ్రామంలో కుళాయిలు బిగించడానికి, వీధిదీపాలు పెట్టించడానికి, మొరీలనుంచి బురద తీయించడానికి, సఫాయి కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి ఒక్కపైసాలేక, ప్రభుత్వం నుంచిరాక  నానావస్థలుపడుతూ, అటు ప్రభుత్వ అధికారుల నుండి వేధింపులను భరించలేక అధికవడ్డీకి అప్పులుతెచ్చి పెట్టి, తలకుమించిన భారాన్ని మోస్తున్నారనడంలో ఎలాంటి అసత్యంలేదు.

అంతెందుకు ఇప్పటివరకు ఈరెండు సంవత్సరాల కాలంలో గ్రామ ప్రథమపౌరులు ఆయా గ్రామాలలో నూతనంగా ఏఒక్కరికి రేషన్ కార్డు గాని, పింఛన్లు గాని ఇప్పించలేని దుస్థితి ఏర్పడింది. ఇదిగాక గ్రామాలలో వీధి దీపాల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు చెందిన బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రభుత్వం సర్పంచుల పాత్రను నామమాత్రం చేసిందని చెప్పవచ్చు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రైలర్, వాటర్ ట్యాంకర్ ఉండాలనే ఒకనిబంధన తీసుకురావడంతో అధికారులు సూచించిన విధంగా ఆయా కంపెనీలకు చెందిన 5 లక్షలు ఖర్చుపెట్టి ట్రాక్టర్, 1.88 లక్షలు ఖర్చుపెట్టి ట్రైలర్, 1.83 లక్షలు ఖర్చుపెట్టి ట్యాంకర్ తీసుకువచ్చి, దానికి డ్రైవర్ లను నియమించి, వారికి జీతాలు ఇవ్వలేక, వాటిని కొనడానికి తీసుకువచ్చిన అప్పులను తీర్చలేక, అందులో పోయడానికి డిజిల్ ఖర్చులను భరించలేక, ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక నానాతంటాలు పడుతున్నారు.

అప్పులు ఎక్కువ కావడంతో,ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా బిల్లులురాక కొన్ని గ్రామాలలో సర్పంచులు సైతం ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివిధ మాధ్యమాలలో చూసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో 12751 గ్రామపంచాయతీలలో 2019 జనవరిలో ఎన్నికలు  జరిగిన విషయం అందరికి తెలిసిందే. అందులో ఏకగ్రీవంగా ఎన్నికయితే రాష్ట్రప్రభుత్వం నుండి 10లక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేల నుండి 5లక్షలు మొత్తం పదిహేనులక్షల రూపాయలను ఆ గ్రామ అభివృద్ధికై మంజూరు చేయాలి. అలా రాష్ట్రవ్యాప్తంగా 2134 పంచాయతీలలో సర్పంచులు వార్డునెంబర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన ఇప్పటివరకు ప్రభుత్వం నుండి నయాపైసా రాకపోవడం దురదృష్టకరం అని చెప్పకతప్పదు.

ఇంకా దరిద్రమైన విషయం ఏమిటంటే ప్రతినెలా సర్పంచులకు చెల్లించే  5000రూపాయల గౌరవవేతనం గత 11మాసాల నుండి రాకపోవడం అనేది ప్రభుత్వపు పాలనకు  అద్దంపడుతుంది.

గ్రామప్రజలకు అండదండగా నిలుస్తూ, ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను చూసుకుంటూ, గ్రామ సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపుతూ, గ్రామాభివృద్ధికి దోహదపడుతూ ఉండాల్సిన గ్రామ ప్రథమపౌరుడు నిధులులేక, ఏలాంటి కార్యక్రమాలు చేయలేక, ప్రభుత్వ ఆదేశాలమేరకు తలపెట్టాల్సిన పనుల నిమిత్తం అప్పులుతెచ్చి చేసిన ఆబిల్లులురాక, చేసిన అప్పులకు వడ్డీలుపెరిగి అష్టకష్టాలు పడుతుంటే ఆగ్రామప్రజలే జాలిపడే విధంగా తయారయింది.

ఇంకా గ్రామాలలో రోజురోజుకు గ్రామ ప్రథమపౌరుడుకు ఉండే గౌరవమర్యాదలు సైతం దిగజారిపోవడం అనేది వాస్తవం అని చెప్పకతప్పదు. అసలు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఏమైనా అధికారాలు ఉన్నాయా?మంత్రివర్గం అనేది కనిపిస్తుందా? ఏమంత్రి అయినా జవాబుదారీతనంతో పనిచేస్తున్నాడా అంటే జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహాయిస్తే ఎవ్వరూ కనిపించడంలేదు. వారికి లేని గౌరవమర్యాదలు, స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుంటే గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ ల గురించి ఆలోచించే ఆస్కారం ఎక్కడ ఉంటుంది? అనే పలుప్రశ్నలు ఉత్పన్నమవ్వక  తప్పనిపరిస్థితి.

ఎన్నోఆశలతో యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకమై కొట్లాడితెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఎలాంటి పాలనగావిస్తున్నారో ఎవ్వరికి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. అధికారం అనేది ఒకరిద్దరిచేతిలో ఉంటే అది ప్రజాస్వామికపాలన అనిపించుకోదు.

వార్డు మెంబర్ నుండి మొదలుకుంటే దేశప్రధాని వరకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికకాబడిన ప్రతి ఒక్కరికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పుడు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకున్నప్పుడే యావత్తు సమాజం అభివృద్ధివైపు పయనించే వీలుంటుంది.

కానీ రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనిపించకపోవడం, ప్రజలుసైతం ఈమధ్యన జరిగిన ఎన్నికలలో పాలనవిధానాన్ని వ్యతిరేకించే విధంగా ప్రవర్తించడం అందరికీ తెలిసిందే.ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజావసరాలను,సమస్యలను తెలుసుకుని పరిష్కారమార్గాలను చూపెట్టాల్సిన అవశ్యకత ఎంతైనాఉన్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో,ఎలాంటి పాలన కావాలనుకుంటున్నారో తెలుసుకుని దానికనుగుణంగా మారాలి. అధికారం కట్టబెట్టారు కదా! ప్రజలతో మాకేంపని, మేము చేసిందే అభివృద్ధి అనుకోని పాలనగావిస్తే, వచ్చేఎన్నికలలో ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అందరికీ తెలిసినవిషయమే.

ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అందరిని సమానంగా చూడాలి. అంతేగాని ఓట్ల రాజకీయంలో భాగంగా అవసరంవచ్చిన ప్రాంతాలలో అభివృద్ధి పథకాలు, అనేక తాయిలాలు ప్రకటించడం సరిఅయినదికాదు. రాష్ట్రప్రజలు ప్రతివిషయాన్ని గమనిస్తూ,అవసరం వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలిసి, నిరూపిస్తూ వస్తున్నారు.

కావున ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనవలసిన అవసరం ఉన్నది. ఇన్నిరోజులు ప్రశ్నించే తత్వానికి సంకెళ్ళువేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అన్ని రాజకీయపక్షాలు సైతం ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఆధారాలతో నిరూపిస్తూ,నిలదీస్తూ, ప్రశ్నిస్తూవస్తున్నారు.ఇప్పటికైనా ప్రజావసరాలను గుర్తించి పాలన కొనసాగించాలని ఆశిద్దాం.

-డా.పోలం సైదులు