కేంద్రం నిర్ణ‌యంపై స్వలింగ సంపర్కుల ఆగ్ర‌హం

203

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త ఇవ్వ‌లేని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

త‌మ‌ను కూడా గుర్తించాలంటూ స్వ‌లింగ సంప‌ర్కులు చేసిన విజ్ఞ‌ప్తిని మోడీ స‌ర్కారు తిర‌స్క‌రించింది.

ఈ నిర్ణ‌యం దేశవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు దారి తీసేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్వలింగ సంపర్కులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్వలింగ సంపర్కుల వివాహాలు భారత సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని, సమర్థించలేమని కేంద్రం తాజాగా చేసిన ప్రకటన ఎల్జీబీటీక్యూ సమాజంలో కలకలం రేపుతోంది.

సాధారణ పౌరులతో సమానంగా తాము పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడుతున్నారు.

ఈ వివాదం ఎందుకు త‌లెత్తింది?

స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టపరంగా గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.

దీన్ని ప్రాథమిక హక్కుగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన రాఘవ్ అశ్వతి, ముఖేష్ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి, అధికారికంగా గుర్తించడానికి హిందూ వివాహ చట్టంలో సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తన వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్రాన్ని కోరింది.

స్వలింగ సంపర్క వివాహాన్ని గుర్తించలేము

స్వలింగ సంపర్కుల వివాహాన్ని ఏరకంగానూ గుర్తించలేమని కేంద్రం కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పింది. తన నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది.

అనంతరం ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటీషన్‌పై విచారణను వచ్చేనెల 20వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయడం.. దాన్ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించడం.. సంచలనంగా మారింది.

ఎల్జీబీటీక్యూ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణమైంది.

ఇది సంస్కృతికి వ్యతిరేకం..

పురుషులు, మహిళల మధ్య ఏర్పడే వివాహ బంధానికి మాత్రమే గుర్తింపు ఉందంటూ కేంద్రం స్పష్టం చేసింది.

హిందూ వివాహ చట్టం దానికే మద్దతు పలుకుతుందని పేర్కొంది. ఇద్దరు మగవారు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఏర్పడే వివాహ బంధాన్ని వ్యవస్థ అంగీకరించదని తెలిపింది.

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అది పూర్తిగా విరుద్ధమని అఫిడవిట్‌లో పొందుపరిచింది.

హిందూ వివాహ చట్టం గానీ, సమాజం గానీ, ఈ వివాహాన్ని గుర్తించబోదని, ప్రోత్సహించనూ లేదని వెల్లడించింది.

హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 ప్రకారం అది వ్యతిరేకమని తెలిపింది.

ఇదివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం స్వలింగ సంపర్కుల మధ్య శారీరక సంబంధానికి మాత్రమే వర్తిస్తుందని, వివాహానికి వర్తించదని కేంద్రం హైకోర్టు దృష్టికి తెచ్చింది.

పురుషుడిని భ‌ర్త‌గా, స్త్రీని భార్య‌గా

స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటే ఎవరిని భార్యగా లేదా భర్తగా గుర్తించాల‌ని కేంద్రం ప్ర‌శ్నించింది.

ఒక పురుషుడిని భర్తగా, మహిళను భార్యగా గుర్తించడానికి లింగపరమైన తేడాలు ఉన్నాయని తెలిపింది.

అదే స్వలింగ సంపర్కుల విషయంలో ఎలా నిర్ధారించగలమని సందేహం వ్య‌క్త‌ప‌రిచింది.

పైగా ఈ తరహా వివాహానికి అనుమతి ఇవ్వడం గానీ దాన్ని చట్టపరంగా గుర్తించడం గానీ జరిగితే ఇప్పటికే అమలులో ఉన్న వివాహ చట్టాలకు విలువ ఉండదని పేర్కొంది.

భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

స్వలింగ సంపర్కుల ఆగ్ర‌హం

కేంద్రం వైఖరి పట్ల దేశవ్యాప్తంగా లెస్పియన్స్, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

తోటి పౌరులతో సమానంగా తాము పోరాడి సాధించిన హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడుతున్నారు.

భారత్‌లోని స్వలింగ సంపర్క సమాజం ప్రపంచంతో పోటీ పడి హక్కులను సాధించుకోలేకపోవడానికి కారణం ఇక్కడి ప్రభుత్వాలేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

స్వలింగ సంపర్కులైనంత మాత్రాన వారికి చట్టాలు వర్తించబోవనడం ఎంత మాత్రమూ సరికాదని అంటున్నారు.

చట్టం అందరికీ సమానం కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని హర్షించబోమని చెప్పారు.