ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ రింగ్‌ రోడ్డు

330
ring-road-around-osmania-university

ఉస్మానియా వర్సిటీ పరిధిలో ప్రశాంత వాతావరణం, పర్యావరణహిత పరిస్థితులను నెలకొల్పగలిగితే ,  క్యాంప్‌సలోకి బయటి వ్యక్తులకు చెందిన వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించగలిగితే , వర్సిటీ పరిధిలోని భూముల కబ్జాను పూర్తిగా నియంత్రించగలిగితే , గొప్ప చరిత్రగల ఓయూకు మరింత వన్నెలు అద్దినట్టే కదా! ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? దీనికి జీహెచ్‌ఎంసీ ఒకే ఒక పరిష్కారమార్గాన్ని ప్రతిపాదిస్తోంది! అదే.. ‘ఉస్మానియా వర్సిటీ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణం’! క్యాంపస్‌ ఎన్‌సీసీ గేటు లోపల ఉన్న ఆంధ్ర మహిళాసభ నుంచి మాణికేశ్వరినగర్‌, అడిక్‌మెట్‌ రోడ్డు.. డీడీకాలనీ నుంచి హబ్సిగూడ రోడ్డును తార్నాకకు అనుసంధానిస్తూ 100-120 అడుగులతో రింగ్‌రోడ్డును నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదిస్తోంది.



 

ఓవైపు కోఠి, బర్కత్‌పుర, శివంరోడ్‌, ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్‌ల నుంచి విద్యానగర్‌ మీదుగా ఎన్‌సీసీ గేటు నుంచి.. మరోవైపు తార్నాక వైపు నుంచి క్యాంప్‌సలోకి వాహనాలు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశిస్తున్నాయి. వర్సిటీ రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాల్లో దాదాపు 80శాతం బయటి వ్యక్తులవే అని గతంలో నిర్వహించిన పరిశీలనలో గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌ కళాశాలలతోపాటు మహిళల హాస్టల్‌, లైబ్రరీల వద్ద రోడ్డు దాటడం సమస్యగా మారింది. వాహనాల రొదతో విద్యార్థులకు ప్రశాంతత కరువైంది. చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. అన్నింటికన్నా ప్రధాన సమస్య ఓయూ భూముల ఆక్రమణల పర్వం! నిజాం హయాంలో దాదాపు 2400 ఎకరాల విస్తీర్ణంలో ఓయూను ఏర్పాటు చేశారు. ఈ భూమిలో ఇప్పటికే 800 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైంది.

ఓయూ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించే ప్రణాళికలో భాగంగా 100 -120 అడుగుల మేర రోడ్డు ఉండేలా ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్‌సీసీ గేటు లోపల ఉన్న ఆంధ్రమహిళా సభ నుంచి అడిక్‌మెట్‌ రోడ్డును అనుసంధానిస్తూ రహదారిని నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎన్‌సీసీ గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఎదుటకు మార్చాలని భావిస్తున్నారు. ఈ గేటు వర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం కానుంది. ఆంధ్ర మహిళాసభ పక్క నుంచి నిర్మించే మార్గం అడిక్‌మెట్‌, పీజీఆర్‌ఆర్‌సీడీఈ, ఇఫ్లూ మీదుగా తార్నాక ప్రధాన రహదారిని కలుస్తోంది. ఎన్‌సీసీ గేట్‌ నుంచి క్యాంపస్‌ ప్రహరీ పక్కనే డీడీ కాలనీ మీదుగా ఇప్పటికే 40 అడుగుల రోడ్డు ఉంది. మధ్యలో కొన్నిచోట్ల ఉన్న ఆక్రమణలను తొలగించి రవీంద్రనగర్‌ మీదుగా హబ్సిగూడ ప్రధాన రహదారిని కలుపుతారు. దీనికి రూ.15కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.



 

ఓయూ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కొన్ని విద్యార్థి సంఘాలు, కొందరు ప్రొఫెసర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో విద్యార్థి సంఘాల నాయకులు, వర్సిటీ అధికారులతో భేటీ అయ్యేందుకు ఓయూ పూర్వ విద్యార్థి, ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.