ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50

280

అన‌వ‌స‌రం ప్ర‌యాణాల‌ను త‌గ్గించేందుకు లోక‌ల్ ట్రైన్స్ ధ‌ర‌లు పెంచిన సెంట్ర‌ల్ రైల్వే మ‌రో షాకిచ్చింది.

ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను తక్షణమే అందుబాటులోకి తెచ్చింది.

పెరిగిన ప్లాట్‌ఫాం ధరలు మార్చి 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు.

జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని చెప్పారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు శివాజీ సుతార్ తెలిపారు.

ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని వివరించారు.

సాధారణంగా ముఖ్యమైన పండగల సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతారు.

కానీ ఈసారి ఐదు రెట్లు పెంచ‌డం చర్చనీయాంశంగా మారింది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌, దాదర్ అండ్ లోకమాన్య తిలక్ టెర్మినల్‌తో పాటు థానే, కళ్యాణ్, పన్వేల్, బీవాండీ రైల్వే స్టేషన్లలో ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది.

వేసవి కాలంలో సాధారణంగా రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి ధరలను పెంచినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి రెండో వారం నుంచి ముంబైలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ముంబైలో ఇప్పటివరకు 3.25 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ (COVID-19) కారణంగా 11,400 మంది మరణించారు.