పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

105
petrol rates buddget

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో వార్షిక బడ్జెట్-2021 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు పన్నులు, ధరలపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుందో అనే విషయంపై తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, మద్యం ధరలపై విస్తృతస్థాయిలో చర్చించుకుంటున్నారు.

లీటరు పెట్రోలుపై రూ.2.50, డీజిల్ పైరూ. 4 చొప్పున ఏఐడీసీ (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్)ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి విధితమే. దీంతో ఇంధన ధరలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలపై వెంటనే ఈ భారం పడబోదని, పెట్రోల్, డీజిల్‌పై బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (బీఈడీ), స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని తగ్గిస్తున్నామని కేంద్రం పేర్కొంది.

బీఈడీని రూ. 2.98 నుంచి రూ.1.40కు, ఎస్ఏఈడీని రూ. 12 నుంచి రూ. 11కు తగ్గిస్తున్నామని, డీజిల్ పైలీటరుకు ప్రస్తుతమున్న బీఈడీని రూ. 4.83 నుంచి రూ.1.80కు, ఎస్ఏఈడీని రూ. 9 నుంచి రూ. 8కి కుదిస్తున్నామని ప్రకటించింది. అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ విధించినా పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పు ఉండదని, వినియోగదారులపై అదనపు భారం పడబోదని కేంద్రం ప్రకటించింది.