ఆడవారిని అడ్డంపెట్టుకోని మగవారి రాజకీయమేంటి ?

178
husbands politics behind wives

స్వాతంత్ర్యానికి పూర్వం ఆడవారంటే వంటింటికే పరిమితం, ఆడ పిల్లలను కనడానికి, చదివించడానికి సైతం అంత శ్రద్ధ వహించేవారుకాదు, ఎందుకంటే పెళ్ళీచేస్తే అత్తారింటికి వెళ్ళుతుంది . . మనకెందుకులే అని తెలువకుండానే ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసే పక్రియ, ఆతర్వాత కాలక్రమేణా ఎన్నో మార్పులు . . ఎంతో జ్ఞానం, ఒకనాడు డబ్బులిచ్చి వధువును కొనుక్కొనే స్థాయి నుంచి డబ్బులు తెచ్చే వధువు వరకు పరిణితి చెందాము.

ఆనాడు భారతీయ మెదటి మహిళా అధ్యాపకురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొదలుకొని, నేటి వాస్తవిక సమాజంలో ఎందరో మహమణుల కృషిఫలితంగా నేడు వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడమే గాకుండా మగవారికి ఎంతవరకు రిజర్వేషన్స్ ఉన్నాయో, అంతా మాకు కూడా కావాలని ప్రశ్నించే గొంతుకలను చూస్తున్నాము.

అలాగే “ మాకెవరు సాటి – మాకు మేమే సాటి” అనేలా మగవారుచేసే ప్రతి పనినిచేస్తూ నిరూపిస్తున్న తరుణం, ఒక్కరంగంలో గాకుండా ప్రతిరంగంలోకి ప్రవేశించి మహిళ అంటే ఏంటోనని పలువురికి ఆదర్శముగా నిలుస్తున్న ఆదర్శమహిళలెందరో ఉన్నారు. అలాగే సాహిత్యరంగంలో సైతం ఎందరోమహిళలు ఎన్నోరచనలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తరుణం, అందులోభాగంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న సమయం. ఇవియేగాకుండా విభిన్న రంగాలలో మహిళామణులు తమకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకొని మాకెవ్వరు సాటిలేరని చెప్పేసమయంలో ప్రస్తుత సమాజమున్నది.

ప్రత్యేకంగా పాలకవర్గంలో మహిళమూర్తులు ఆదర్శవంతమైన పాలనగావించి తమ ధైర్యసాహసాలను చెప్పకనే చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో గ్రామీణప్రాంతాలలో దానికివిరుద్దంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అబద్దంలేదు . స్థానికఎన్నికలలో రిజర్వేషన్ల కారణంగా ఎన్నికైన వార్డుమెంబర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిసిటీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు భర్తలకు అవకాశం రాకపోవడంతో వారిభార్యలను ఎన్నికలబరిలోకి దిగబెట్టి, గెలుపొంది, ఆయాస్థానాలను చేజిక్కించుకోవడం జరిగింది. కానీ వారిని కేవలం సంతకాలకే పరిమితంచేసి, వారిస్థానాలలో భార్యచాటు భర్తలా అధికారాలను చెలాయించడం జరుగుతుందంటే కారణం ఏమిటో అర్థంగానీ పరిస్థితి. కార్యాలయాలలో ఎన్నికకాబడిన మహిళామణులున్నా కూడా ఏదైనా అవసరనిమిత్తం వెళ్ళితే, ముందుగా వారిభర్తను కలిసి, పర్మిషన్ తీసుకోని, అతను సమాచారం అందిస్తేగానీ పనికానీ పరిస్థితి దాపురించిందంటే అతిశయోక్తిలేదు. ఇదంతా దేనికి సూచియో అర్థంకానీ పరిస్థితి.

ఎందరో ఆదర్శ మహిళలు పోరాడి, రాజ్యాంగ పరంగా వారికంటూ స్థానాలుండాలని పోరాడితే ఇలాంటి అవకాశాలు పొందడం జరిగింది గానీ చివరికి అధికార చెలాయింపు, నిర్ణయాలు తీసుకునే అధికారం వారికీ లేకపోవడమనేది సిగ్గుచేటు. భారతీయ సాంప్రదాయంలో ప్రస్తుత తరుణంలో ఒక కుటుంబం సంతోషాలతో ఉన్నదంటే కారణం ఆ కుటుంబ బాధ్యతలను మహిళామణులు చూసుకోవడమనేది నగ్నసత్యం. అలాంటి తరుణంలో పూర్తిగా నిర్ణయ బాధ్యతలుసైతం వారికేఇస్తే సమాజాన్ని బాగుపరుస్తారు కదా !

ఎందుకీ ఈ మగవారి పెత్తనం

అంటే రాజ్యాంగ పరంగా వారికంటూ అవకాశాలిస్తూ, వాటిని మగవారు చేతులోకి తీసుకోవడమా . . ! ఇది సరైన పద్ధతేనా ? రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి కేంద్రీకరించి సరైన చర్యలు తీసుకోని, వారికీ ప్రత్యేకశిక్షణలిస్తూ, స్వతహాగా నిర్ణయం తీసుకునేలా, వారితరుపు మగవారి పెత్తనం లేకుండేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇలా చేయకబోతే ఆడవారికి ప్రత్యేక రిజర్వేషన్స్ అనే విషయంలో ఎలాంటి అర్ధం, లాభంలేని పరిస్థితి.

ఎన్నికలలో గెలిచిన మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండేలా, వారిపై వారి కుటుంబ సభ్యుల నియంత్రణ లేకుండేలా, కార్యాలయాలలో ఆడచాటు మగపెత్తనం ఉండకుండా చర్యలు తీసుకుంటూ మహిళలకు వచ్చిన రిజర్వేషన్స్ ను గౌరవిస్తూ, స్వేచ్ఛను కల్పించే విదంగా ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

సమాజంలో మహిళలకు రాజ్యాంగపరంగా 33శాతం రిజర్వేషన్స్ కలిగిఉన్నారు.గత కొంతకాలంగా పురుషులకు సరిసమానంగా అన్నిరకాల కార్యకలాపాలలో పాల్గొంటూ “మాకు ఎవరు సాటి లేరు” అని నిరూపిస్తూ, చట్టసభలలో 50శాతం రిజర్వేషన్స్ కావాలని పోరాడుతూవస్తున్నారు. త్వరలో అధికారికంగా సాధించిన ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ క్షేత్రస్థాయిలో రాజ్యాంగపరంగా మహిళ ఎన్నికైన, వారిని అడ్డం పెట్టుకొని మగవారే అధికారం చెలాయిస్తూ, రాజకీయంగా ఎదగనించడం లేదనడంలో ఎలాంటి అబద్ధంలేదు.“ఇంటికి దీపం ఇల్లాలు” అంటారు.

ప్రస్తుతం అధికశాతం కుటుంబాలలో మహిళా నిర్ణయాలే శిరోధార్యం,అలాంటి కుటుంబాలే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాయి అనడం సైతం జగమెరిగిన సత్యం. వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తే వారితెలివిని రుజువుచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతెందుకు దేశానికి ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి, ఒక మహిళాశక్తి ఏంటో నిరూపించలేదా? ప్రతిభాపాటిల్ దేశప్రథమ పౌరురాలుగా, రాష్ట్రపతిగా విధులు నిర్వహించలేదా? సుష్మాస్వరాజ్ ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయలేదా? షీలాదీక్షిత్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, వసుంధర రాజే, సుచేతా కృపాలాని, ఉమాభారతి, రబ్రీదేవి, ఆనందిబెన్ పటేల్ ఇలా వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా సేవలు చేయలేదా? చేస్తలేరా? అలాగే విభిన్న రంగాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ అగ్రస్థానాలకు చేరుకున్న వారెందరో ఉన్నారు.

అలాంటిది ప్రస్తుత రాజకీయాలపట్ల మహిళామణులు దృష్టి సారించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇంకా ఎంతోమంది మహిళలు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ పాలకరంగంలో రాణించినమాట వాస్తవంగాదా ! గ్రామాలలోకి వచ్చేసరికి వారినీ స్వంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడమనేది దేనికినిదర్శనమో అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చుకోరు, క్రమంగా అర్ధమవుతుంటాయి, వారికీ ఆ స్వేచ్ఛనిస్తే రాణిస్తారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజ్యాంగం పరంగా ఎవరి హక్కులను కాలరాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరిపై ఉన్నది. ఇకనైనా మార్పు రావాలని ఆశిద్దాం.

– డా. పోలం సైదులు