రాజమౌళి సినిమాలో అవకాశం..మోసపోయిన మహిళా లాయర్

367

ఓ కేటుగాడు జస్ట్‌ డయల్‌లో తాను ప్రొడ్యూసర్‌నని, తనకు న్యాయ సహాయం కావాలని చెబుతూ అడ్వకేట్ల వివరాలు సేక రించేవాడు. ఇతడి వలలో ఓ మహిళా న్యాయవాది చిక్కు కుంది. ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి సినిమాలో హీరో తల్లి వేషం ఇప్పిస్తానని సుమారు రూ. 50 లక్షలు తీసుకుని మొహం చాటేశాడు. ఈ మోసంలో ఇతడికి మరికొంతమంది సహకరించారు.

సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నఓ మహిళా న్యాయవాదిని మోసం చేసి పలు దఫాలుగా రూ. 50 లక్షలను వసూలు చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 65 వేలు కారు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆమె నుంచి డబ్బులు దండుకోవడానికి సహకరించిన మరో 13 మంది పరారీలో ఉన్నారు. కొండాపూర్‌ మసీద్‌బండ ప్రాంతానికి చెందిన వీరబంతి నరేష్ కుమార్‌ అలియాస్‌ నరేష్‌ అలియాస్‌ ఆదిత్య అలియాస్‌ జయ్‌(28) బంజారాహిల్స్‌ కోని ల్యాబ్స్‌లో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జస్ట్‌ డయల్‌ ద్వారా న్యాయవాదుల ఫోన్‌నంబర్లను తీసుకుని తాను సినీ ప్రొడ్యూసర్‌నని, న్యాయ సహాయం కావాలంటూ ఫోన్‌ చేసి వారి వివరాలు తెలుసుకునే వాడు. ఇలా చేస్తున్న తరుణంలో నగరానికి చెందిన మహిళా న్యాయవాది పరిచయమైంది. న్యాయ సహాయం కావాలంటూ ఆమెతో తరచూ మాట్లాడేవాడు. డైరెక్టర్‌ రాజమౌళి తీస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రొడ్యూసర్‌నని నమ్మించాడు. ఆమెకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని గమనించిన అతడు రాజమౌళితో మాట్లాడి హీరో తల్లివేషం ఇప్పిస్తానని చెప్పాడు. ఆమెను నమ్మించేందుకు గొంతుమార్చి రాజమౌళి గొంతుతో మాట్లాడాడు.

రాజమౌళి తనతో మాట్లాడి సినిమాలో అవకాశం ఇస్తానన్నాడని చెప్పడంతో ఆమె నమ్మింది. సినిమాల్లో నటించాలంటే ఫిల్మ్‌చాంబర్‌ కార్డు కావాలని, మా ఐడీకార్డు, టీవీ సీరియల్‌ కార్డుల పేరుతో ఆమె నుంచి పలు దఫాలుగా వివిధ అకౌంట్‌లలో డబ్బులు జమ చేయించుకున్నాడు. ఇందుకు బైరామల్‌గూడలో ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్న మునుకుంట రామకృష్ణ అలియాస్‌ రామ (20), సరూర్‌నగర్‌లో నివసించే పెయింటర్‌ కొమ్ము సోమన్న(33)తోపాటు మరో 13 మంది సహకరించారు. వీరందరూ ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ దశల వారీగా ఆమె నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. ఆదిత్య ఆ డబ్బుతో విలాసాలు చేయసాగాడు. ఫ్రిజ్‌, సౌండ్‌ సిస్టం, బంగారు నగలు కొన్నాడు. షూటింగ్‌ లొకేషన్‌ చూసి వస్తానంటూ న్యాయవాది మారుతీ కారు(టీఎస్‌ 10 ఈఆర్‌ 4251) తీసుకొని తిరిగి ఇవ్వకుండా సొంత పనులకు వాడుకుంటున్నాడు.

ఆమె వద్ద డబ్బులు అయిపోయాయని గ్రహించిన నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. చంపుతానని బెదిరించి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు నరేష్‌తోపాటు రామకృష్ణ, సోమన్నను సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరికి సహకరించిన కిరణ్‌, వినయ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, పూర్ణచందర్‌, గౌతమి, శివప్రసాద్‌గౌడ్‌, రాంబాబు, కాపెట్ల మహేష్‌, అక్కి మహేష్‌, కె. మహేందర్‌, గుండ్లపల్లి రవీందర్‌, కె. ఆండాలు, తుమ్మ వేణు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 65 వేలు, కారు, 19.270 గ్రాముల బంగారు నగలు, 111.55 గ్రాముల వెండి తాడు, నాలుగు సెల్‌ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు, ఫ్రిజ్‌, రెండు టీవీలు, సౌండ్‌ సిస్టం, సెట్‌టాప్‌ బాక్స్‌, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నరేష్ పై గుంటూరు జిల్లా, కొల్లిపర పోలీస్ స్టేషన్‌లో గతంలో చీటింగ్‌ కేసు నమోదైంది.