జగన్ ను అభినందించిన చంద్రబాబు

282

అసెంబ్లీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు అభినందస్తూనే చురకలు వేశారు. ఈరోజు అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ కరకట్టపై నిర్మాణాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం అని, నదీ పరీవాహక ప్రాంతాల్లో తీరంపై కట్టడాల వల్ల నది దిశను మార్చుకుంటుందని, వరదలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అనంతరం చంద్రబాబు జగన్ చెప్పింది నిజమేనని నదీ తీరంలో కట్టడాల వల్ల నదికి వరదలు వచ్చినపుడు దిశ మార్చుకుని ప్రవహించే ప్రమాదం ఉందని చెప్పి జగన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.

అదేసమయంలో ఉండవల్లిలోని తన నివాసం కృష్ణానది పరీవాహక ప్రాంతం కిందకు రాదని, ఒకప్పుడు గూగుల్ మ్యాప్ లో చూసినా కృష్ణా నది భవానీ ద్వీపం నుంచి చూపిస్తుందని వ్యాఖ్యానించారు. కృష్ణా బ్యారేజీ నిర్మాణం వల్ల నదిలోని ఓ పాయ చీలి ఇటువైపుగా ప్రవహిస్తోందని అందువల్ల తాను ఉంటున్న ఇల్లు ఆ పాయ పక్కన కట్టి నిర్మాణమని, అందుకే అది అక్రమ కట్టడం కిందకు రాదన్నారు. ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో లెక్కా? అని పేదలు, తీర ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారిని భయాందోళనలకు గురిచేయడం తగదని చంద్రబాబు హెచ్చరించారు. వారికి ప్రత్యమ్నాయం చూపి పక్కకు తరలించాలని సూచించారు.

నేను ప్రజావేదిక కోరుతూ లేఖ రాసి తప్పు చేశానని, నేను అడగడం వల్లే ఈ ప్రభుత్వం దానిని కూల్చివేసిందని, నేను అడగకపోతే కూల్చేవారు కాదని అన్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా తాను ఉన్న ఇంటిని కూల్చేస్తే, రోడ్డుపై పడుకుంటానే తప్ప ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.