ఆన్‌లైన్‌ చాయ్‌ బిజినెస్‌తో రూ.2 కోట్ల వ్యాపారం!

237

కొంతమంది వ్యాపారం చెయ్యాలని కసితో ఉంటారు. అయితే.. ఆచరణలో మాత్రం పాటించరు. మరికొందరు ఎవరో ఏదో చేశారని.. మనం కూడా చెయ్యాలనే ఆతృతతో ఏదో ఒక వ్యాపారంలోకి దిగి నిండా మునిగిపోతుంటారు. కారణం.. పక్కా ప్రణాళిక లేకపోవడం. అయితే ఈ కుర్రాళ్లు మాత్రం.. పక్కా ప్రణాళికతో ముందడుగు వేసి.. ఆచరణలో చూపించి సక్సెస్ అయ్యారు. అందుకు ప్రతిఫలం ప్రతియేట 2 కోట్ల రూపాయల ఆదాయం.

పెద్ద బిజినెస్‌లోకి దిగి కోట్ల రూపాయలు వెనకేసుకుందామనే ఆలోచన కాదు ఈ ఇంజినీరింగ్ స్నేహితులది. చేసేది చిన్న వ్యాపారమైనా ప్రణాళికాబద్ధంగా, కస్టమర్‌కు నాణ్యతను పరిచయం చెయ్యాలనుకున్నారు. ఇదే వీరికి విజయాన్ని అందించింది. ఇంతకీ వీరు ఎంచుకున్న బిజినెస్ ఏంటో తెలసా? చాయ్ అమ్మడం. ఏంటీ.. ఇంజినీరింగ్ చదివింది చాయ్ అమ్మడానికా? అని చీప్‌గా చూడకండి. ఎందుకంటే చదువు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. తెలివితేటలు జీవితంలో ఎలా బతకాలో నేర్పుతాయి. అందుకే ఇంజినీరింగ్ విద్యతో వ్యాపార మెళకువలు నేర్చుకొని.. తమకున్న తెలివితేటలతో విజయపథంలో నడుస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభినవ్ టండన్, ప్రమిత్ శర్మ.

టీతో కోట్లలో వ్యాపారం

అభినవ్, ప్రమిత్‌లు కేవలం టీ అమ్ముతూనే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వినడానికి వింతగానే ఉన్నా.. ఇది అతిశయోక్తేమీ కాదు. ఇక టీ అమ్మడమంటే.. ఇద్దరూ ఫ్లాస్కో, పేపర్ గ్లాసులు పట్టుకొని వీధి వీధి తిరగడం కాదు. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా చాయ్ అమ్మడం. అదే వీరి టెక్నిక్. ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్స్, యాప్స్‌లో ఏవైనా వస్తువులు, ఆహార పదార్థాలు ఆర్డర్ చేసుకుంటే నిమిషాల్లోనే మన ముందుకు వచ్చేస్తున్నాయి. అభినవ్, ప్రమిత్ కూడా ఆన్‌లైన్‌లో, ఫోన్ల ద్వారా టీ అమ్ముతున్నారు. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వేడి వేడిగా, రచికరమైన చాయ్ మీ ముందు ఉంటుంది. అది తాగితే.. మరోసారి ఆర్డర్ చెయ్యకుండా ఉండలేరు. ఎందుకంటే వారు అమ్మే గ్లాస్ చాయ్‌లో కూడా ఎంతో నాణ్యత ఉంటుంది కాబట్టి. ఒకసారి రుచి చూసినవారు తప్పకుండా మరోసారి ఆర్డర్ చెయ్యాల్సిందే అంటారు ఈ మిత్ర ద్వయం.

టీ తాగుతూ చేసిన ఆలోచన..

బరేలీకి చెందిన అభినవ్, ప్రమిత్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. కలిసే చదువుకున్నారు. లక్నోలో ఇంజినీరింగ్ చేశారు. తరువాత వీరిద్దరూ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఎప్పటినుంచో లైఫ్‌లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన వీరిది. సొంతంగా ఏదైనా చేయాలని తరుచూ అనుకునేవారు. వీరికి చాయ్ తాగే అలవాటు ఉంది. ఆఫీస్‌లో పని పూర్తయిన వెంటనే చాయ్ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకునే వారు. ఒకసారి టీ తాగుతూనే టీ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు వచ్చారు. తెలిసిన వారికి తమ ఆలోచన చెప్పారు. అందుకు తగిన ప్రణాళిక వేసుకొని.. కొంత అధ్యయనం చేసి, 2014లో చాయ్ కాలింగ్ పేరుతో నోయిడా సెక్టార్-16లోని మెట్రోస్టేషన్ వద్ద ఒక టీ స్టాల్ ప్రారంభించారు. ఇందులో టీ అమ్ముతూ పిజ్జాలు, బర్గర్లు డెలివరీ చేసేవారు. క్రమంగా పిజ్జా, బర్గర్లతో పాటు టీ డెలివరీ కూడా ప్రారంభించారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందకు నాణ్యమైన టీ అందించేవారు. క్రమంగా చాయ్‌లోని వెరైటీలను పరిచయం చేశారు. ఆర్డర్లు ఎక్కువగా వస్తుండడంతో ఈ వ్యాపారం మరింత వృద్ధి చెందింది. దీంతో 15 నిముషాల్లోనే ఇళ్లకు చాయ్ డెలివరీ చేసేస్తున్నారు. ఇప్పుడు నోయిడాలో రెండు, బరేలీలో 6 స్టాళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం యూపీలో ఈ చైన్‌కు సంబంధించి 15 టీ స్టాళ్లు నడుస్తున్నాయి. వీటి నుంచి ప్రతీ యేటా రూ. 2 కోట్ల ఆదాయం వస్తున్నది.

వందమందికి ఉపాధి

చాయ్ కాలింగ్ ద్వారా దాదాపు 100మందికి పైగా యువతకు ఉపాధి లభిస్తున్నది. ఒక కప్పు టీ 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ వేలాది ఇండ్లకు చాయ్ డెలివరీ చేస్తున్నారు. ఇండ్లతో పాటు ఆయా ఆఫీసుల నుంచి ఆర్డర్లు కూడా వస్తుండడంతో చాయ్ కాలింగ్ బాయ్స్ చాలా బిజీ అయ్యారు. ప్రస్తుతం చాయ్ కాలింగ్ పేరిట వెబ్‌సైట్ కూడా స్టార్ట్ చేశారు. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ ఆఫీసులతో కాంటాక్టులు లభిస్తున్నాయి. 2015లో రూ. 50 లక్షలుగా ఉన్న టీ వ్యాపారం 2019 నాటికి రూ. 2 కోట్లకు చేరుకున్నది. టీ తయారీ దగ్గర్నుంచి, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఆర్డర్లు తీసుకోవడం, వాటిని డెలివరీ చెయ్యడం వంటి విభాగాల్లో స్థానిక యువతకు ఉపాధి లభిస్తున్నది.